Wednesday, May 1, 2024

30 శాతం పతనమైన బిట్ కాయిన్..కారణం చైనా!

వర్చువల్ కరెన్సీ రంగంలో రారాజులా పేరు తెచ్చుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు పతనం దిశగా పయనిస్తోంది. గత కొన్నివారాల్లోనే ఇది 30 శాతం విలువ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం చైనా! ఆసియా పెద్దన్న రెండేళ్ల కిందటే వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్ పై నిషేధాజ్ఞలు విధించింది. క్రిప్టో కరెన్సీ వేదికలపై ప్రజల పెట్టుబడులకు రక్షణ ఉండదని, జరిగే నష్టాలకు ఎవరికి వారే బాధ్యులని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా క్రిప్టోకరెన్సీలపై కొరడా ఝుళిపించడంతో ఇతర దేశాలు కూడా అదే బాటలో నడిచాయి. ఈ పరిణామం బిట్ కాయిన్ కు ప్రతికూలతలను సృష్టించింది. ఫేస్ బుక్ తీసుకువచ్చిన లిబ్రా కరెన్సీపైనా చైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. క్రిప్టో కరెన్సీ నిర్వహణ ప్రభుత్వాలు చేయాల్సిన పని అని స్పష్టం చేసింది. దాంతో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వాస్తవికత ప్రజలకు క్రమంగా అర్థమైంది.

మరోవైపు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో బిట్ కాయిన్ వైపు మొగ్గినా, ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. బిట్ కాయిన్ చెల్లింపులకు తాము వ్యతిరేకం కాదని తొలుత పేర్కొన్న మస్క్… ఆ తర్వాత టెస్లా కార్ల కొనుగోలుకు బిట్ కాయిన్లను  అనుమతించబోమని స్పష్టం చేశాడు. మొదట్లో మస్క్ చేసిన వ్యాఖ్యలతో బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్క బిట్ కాయిన్ విలువ 62,000 డాలర్లను అధిగమించింది. కొన్ని వారాల తేడాతో మస్క్ వెనుకంజ వేయడంతో బిట్ కాయిన్ 15 శాతం పడిపోయింది. ఇప్పుడది క్రమంగా పతనం అవుతూ 30 శాతానికి దిగజారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement