Thursday, April 18, 2024

కరోనాకు ఆయుర్వేద మందు… ఆ నివేదికలో ఏముంది?

కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొగిరి ఆనందయ్య ఇచ్చిన మందులపై విచారణ పూర్తి అయ్యింది.  నివేదిక సిద్ధం చేసిన నెల్లూరు జిల్లా వైద్య శాఖ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. గత నెల 4వ తేదీ నుండి బొగిరి ఆనందయ్య కరోనాకు మందు ఇస్తున్నారు.  ఆయన ఇచ్చే కరోనా ఆయుర్వేదం  మందులు శాస్త్రీయంగా నిరుపితం కావాల్సి ఉందని వైద్యాధికారులు నివేదికలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయుర్వేదం మందు తీసుకుని అనారోగ్యం బారిన పడలేదని నివేదికలో తెలిపారు. కానీ మందు పంపిణీ చేసే చోట కోవిడ్ నిబంధనలు పాటించలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే వరకు కోవిడ్ ఆంక్షలు మందు పంపిణీ చేసే చోట అమలు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలో కరోనాకు ఆయుర్వేద మందు వ్యవహారం సంచలనం రేపింది. ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు ఇస్తున్నారంటూ జనాలు భారీగా క్యూ లైన్లు కట్టారు. కరోనా బాధితులు, జనాలు ఒకరిపై ఒకరు పడి భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఏపీతో పాటూ పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ నుంచి జనాలు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. జిల్లా పంచాయతీశాఖ అధికారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రెవిన్యూ డివిజనల్‌ అధికారి, ఆయుర్వేద డాక్టర్లు, స్థానిక ఎండీవో, తహాశీల్దార్ విచారణ జరిపారు.. కలెక్టర్ లోకాయుక్తకు రిపోర్ట్ సమర్పించారు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో వివిధ రకాల ఆకులు, పొడులతో తయారు చేసిన మందును కరోనా మెడిసన్ పేరుతో అందిస్తున్నారు. ఆయుర్వేద మందు పేరుతో నాటు మందు తయారు చేసి ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వివిధ రకాల ఆకులు, తేనే, శొంఠి, మిరియాలు, అల్లం, ధనియాలు, ఇలా కొన్ని రకాల వస్తువులతో కషాయం, తైలం తయారుచేసి వచ్చిన వారికి ఉచితంగా పెడుతున్నారు. స్థానిక ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా జనం వచ్చి ఈ మందును తీసుకువెళ్తున్నారు. ఈ ఆయుర్వేద మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని కరోనా వచ్చిన వారు కూడా ఆరోగ్యకరంగా ఉంటున్నారని చెపుతున్నారు.

అయితే ఈ మందు విషయంలో డాక్టర్లు ప్రజలను హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయంగా రుజువుకాని మందులు లేహ్యాలు వాడటం ద్వారా కరోనా ఏమోగానీ ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ చేసకుండా.., అసలు దాని ప్రయోజనం ఎంత వరకు ఉంటుందో తెలియకుండానే జనాలు ఎగబడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. వైరస్ వచ్చిన వారు రాని వారు అక్కడకు చేరుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నాటు మందు వ్యవహారం వైద్య శాఖ అధికారుల వరకూ వెళ్లింది. విషయం తెలుసుకున్న డీఎంహెఓ కృష్ణపట్నం పల్లెకు చేరుకొని విచారణ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా కరోనాకు మందు పంపిణి చేయడం ఏంటని నిర్వాహకులను ప్రశ్నించారు.

దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించారు. స్థానిక ప్రజలతో కూడా ఈ కమిటీ మాట్లాడింది. ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందుపై పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎవరూ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు. ఇక్కడికి వచ్చిన రోగులు కూడా మందు తీసుకున్న తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. విచారణ తర్వాత సదరు ఆయుర్వేద చికిత్స ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావాల్సి ఉందన్నారు. చికిత్స తర్వాత పరిణామాలపై పరీక్షలు జరగాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు సదరు చికిత్సకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.

- Advertisement -

ఇదీ చదవండి : బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement