Saturday, April 27, 2024

తెలంగాణ నుండి వ్యవసాయ ఎగుమతులు.. గణనీయస్థాయిలో పత్తి, మాంసం, బియ్యం ఎగుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాడు ఎండిన బీళ్లు, కంపచెట్లు మొలిచిన భూములు. కాని ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణ వ్యవసాయరంగ ముఖ చిత్రం మారిపోయింది. ఒకనాడు తినేందుకు తిండి కూడా లేని పరిస్థితుల నుండి అనతికాలంలోనే ఆహారధాన్యాల ఉత్పత్తితోపాటు వాణిజ్య పంటల ఉత్పత్తిలోనూ తెలంగాణ స్వయం సమృద్ధిని సాధించింది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల శుద్ధి, ప్రాసెస్‌ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆహార శుధ్ది పరిశ్రమల మండళ్లను ఏర్పాటు చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకూ వ్యవసాయ పంట ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్ర స్థూల వస్తూత్పత్తిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల విలువ 2014-15తో పోల్చితే 2022-23నాటికి 186శాతం మేర పెరిగింది.

2014-15లో రాష్ట్ర వస్తూత్పత్తిలో వ్యవసాయం, దాని అనుబంధరంగాల వాటా 14.05శాతం కింద రూ.76, 123కోట్లు ఉండగా ప్రస్తుతం 2022-23 నాటికి అది 2, 17, 877 కు పెరిగింది. వ్యవసాయరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వినూత్న ప్రోత్సాహకాలు, సాగులో సాంకేతికతకు పెద్దపీట వేయడం, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలతో రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థికంగా చేయూతనందుతుండడంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. వరి, మొక్కజొన్న, సోయాబిన్‌, పసుపు, నిమ్మ, మామిడి తదితర పంటల దిగుబడుల్లో గుర్తించదగిన వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేస్తోందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

పంట ఉత్పత్తుల శుద్ధి ద్వారా అదనపు విలువను కల్పించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఆహార శుధ్ది పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టింది. ఎగుమతులకు వీలుగా గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమల ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేస్తోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్దికి పెద్దపీట వేస్తుండడంతో 2019-2021 మధ్యకాలంలో రాష్ట్ర వ్యవసాయరంగం (ఆహారశుద్ది పరిశ్రమల ఏర్పాటుకు) విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించింది. గడిచిన 2019-21 మధ్యకాలంలో దేశంలోని వ్యవసాయ సేవా రంగంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.

రాష్ట్రంలో ఆహార శుధ్ది పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడంతోపాటు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా వ్యవసాయానుబంధ పరిశ్రమల ఏర్పాటు గణనీయంగా పురోగమిస్తోందని వ్యవసాయశాఖ చెబుతోంది. పత్తికి గణనీయమైన డిమాండ్‌ ఉండడంతో పత్తి ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 2014-15లో 619 కోట్ల విలువైన పత్తి తెలంగాణ నుంచి ఎగుమతి కాగా అది 2021-22నాటికి 3053కోట్లకు చేరింది. దీంతోపాటు బియ్యం, జొన్నలు, గోధుమలు, తృణధాన్యాలను కూడా ఇతర దేవాలకు ఎగుమతి చేస్తోంది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ తర్వాత మాంసం ఎగుమతుల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. గడిచిన 2014-15 లో తెలంగాణ నుండి రూ.690 కోట్ల విలువైన మాంసం ఎగుమతి కాగా ఇప్పుడు అది రెండింతలై రూ.1268కోట్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement