Monday, April 29, 2024

గంగవరంలో లంగరేసిన అదానీ.. జీపీఎల్‌ నుంచి 58.1 శాతం వాటాల కొనుగోలు

అమరావతి, ఆంధ్రప్రభ; విశాఖ జిల్లాలో ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కీలక అనుమతి లభించింది. ఈ మేరకు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్స్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతి మంజూరు చేశాయి.. దీంతో ఇన్నాళ్లూ ఈ పోర్టును నిర్వహిస్తున్న గంగవరం పోర్టు లిమిటెడ్‌ నుంచి 58.1 శాతం వాటాలు అదానీ పోర్ట్స్‌ సంస్ధకు బదిలీ అవుతాయి. ఇప్పటికే మిగిలిన షేర్లు బదిలీ చేసుకున్న అదానీ పోర్ట్స్‌ తాజా బదిలీతో 100 శాతం వాటాదారుగా మారిపోయింది.

అదానీ చేతుల్లోకి గంగవరం పోర్టు

గంగవరం పోర్టును నిర్వహిస్తున్న గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్ధ నుంచి దీన్ని అదానీ గ్రూప్‌ స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ సంస్ధ గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ (జీపీఎల్‌)లో మిగిలిన 58.1 శాతం వాటాను కాంపోజిట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ఎన్సీఎల్‌టీ అహ్మదాబాద్‌, ఎన్సీఎల్‌టీ హైదరాబాద్‌ అనుమతులు మంజూరు చేశాయి. ఈ వాటా కొనుగోలుతో జీపీఎల్‌ అదానీ పోర్ట్స్‌ మరియు స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌కు వందశాతం అనుబంధంగా మారుతుందని అదానీ గ్రూప్‌ కంపెనీ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. డీవీఎస్‌ రాజు కుటుంబానికిచెందిన గంగవరం పోర్టు లిమిటెడ్‌ నుంచి గంగవరం పోర్టులో 58.1 శాతం వాటాలను సుమారు రూ.6,200 కోట్లతో అదానీ పోర్ట్స్‌ కొనుగోలు చేసింది. అంతకు ముందే వార్బర్గ్‌ పింకస్‌ నుండి కంపెనీలో 31.5 శాతం వాటాను, ఏపీ ప్రభుత్వం నుంచి మరో 10.4 శాతం వాటాను కొనుగోలు చేసింది.

- Advertisement -

పారిశ్రామికీరణకూ ఊతం

గంగవరం పోర్టును అదానీ పోర్ట్స్‌ కైవసం చేసుకోవడం వల్ల రాష్ట్రం నుంచి కార్గో రవాణా మరింత వేగవంతం కాబోతోంది. తాజా పరిణామంతో ఈ పోర్టు నుంచి 250 మిలియన్‌ టన్నుల కార్గో రవాణాకు ఊతం లభించబోతోంది. రాష్ట్రంలో ఇది మూడో అతిపెద్ద నాన్‌-మేజర్‌ పోర్టు కూడా. 2059 వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో గంగవరం పోర్టుకు రాయితీ ఒప్పందం ఉంది. తూర్పు, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న లోతట్టు ప్రాంతాలకు గేట్వే పోర్టుగా ఉన్న గంగవరం ఓడరేవు బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, చక్కెర, అల్యూమినియం, ఉక్కుతో సహా వివిధ రకాల పొడి, భారీ వస్తువులను రవాణా చేస్తోంది.

కీలక మైలురాయి అన్న అదానీ పోర్ట్స్‌

గంగవరం పోర్టును స్వాధీనం చేసుకోవడంపై అదానీ పోర్ట్స్‌ సంతృప్తి వ్యక్తంచేసింది. దేశంలోని అతిపెద్ద రవాణా సంస్ధగా తమ స్థానాన్ని సుస్ధిరం చేసుకోవడం, తూర్పు, పశ్చిమ తీరాల మధ్య సమానత్వం సాధించడంలో భాగంగా గంగవరం పోర్టును కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో తమకు ఇదో కీలక మైలురాయి కానుందని అదానీ పోర్ట్స్‌ వర్గాలు తెలిపాయి. గంగవరం పోర్టుకు ఇప్పటికే అద్భుతమైన రైలు, రోడ్డు కనెక్టివిటీ ఉందని, ఎనిమిది రాష్ట్రాలలో విస్తరించిఉన్న లోతట్టు ప్రాంతాలకు ఇది వ్యాపార ద్వారం కానుందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఇటీవలే చేరిన హ్యాండ్లింగ్‌ టెర్మినల్‌తో కార్గో వ్యాపారం కూడా వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement