Wednesday, April 17, 2024

Delhi: రాజకీయ పార్టీనా, రాబందుల పార్టీనా?.. వైఎస్సార్సీపీ భూ దందాపై విరుచుకుపడ్డ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖ భూములను సముద్రంలోని తిమింగలాల కంటే రాజకీయ పార్టీలే ఎక్కువగా దోచుకుంటున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. మంగళవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, విశాఖ భూ దోపిడీలో గతంలో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ పోటీపడుతున్నాయని విమర్శించారు. దస్పల్లా భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఆ భూములున్నాయని ప్రభుత్వం ఓవైపు చెబుతూనే.. వాటిని ప్రైవేట్ భూములుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని.. నిజానికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వచ్చాయంటే అవి ప్రైవేట్ భూములు ఎలా అవుతాయని ప్రశ్నించారు.

తమవారికి దోచిపెట్టడం కోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ సైతం ఇలాగే వ్యవహరించిందని, ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి మరీ తమవారికి భూములు పంచిందని విమర్శించారు. విశాఖ భూ దోపిడీపై తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక సిట్, ప్రస్తుత వైస్సార్సీపీ హయాంలో ఒక సిట్ ఏర్పాటయ్యాయని.. ఈ రెండూ వేల పేజీల నివేదికలను ప్రభుత్వానికి అందజేశాయని జీవీఎల్ అన్నారు. అయితే ఆ నివేదికలు బయటపెట్టకుండా జగన్ ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందని ఆయన ప్రశ్నించారు. ఏ భూ మాఫియాను కాపాడేందుకు ఈ సిట్ నివేదికల్ని బయటకురాకుండా చూస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ రెండు నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సామాన్యులను సెక్షన్ 22(ఏ) పేరు చెప్పి వేధిస్తూ బడా బాబుల కోసం ఈ సెక్షన్ ఎత్తేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ భూముల్లో లక్షకు పైగా కుటుంబాలు సరైన ఇంటి కప్పు కూడా లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయని.. అలాంటివారికి న్యాయం చేయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని, కానీ బడాబాబులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దోచిపెట్టేందుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. భూ మాఫియాకు అనుకూలంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ అసలు రాజకీయ పార్టీయేనా లేక రాబందుల పార్టీయా అని జీవీఎల్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

ఓవైపు విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలాన్ని కొనడం కోసం అడిగితేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మాత్రం రాత్రికి రాత్రే అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లను అభివృద్ధి చేయడంలో మీకున్న శ్రద్ధ, రియల్ (అసలైన) అభివృద్ధి లేదని అన్నారు. సెక్షన్ 22(ఏ) బాధితులుగా వేలాది కుటుంబాలున్నాయని, అలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతూ తాను గవర్నర్ కి లేఖ రాశానని చెప్పారు. అలాగే సిట్ నివేదికలను బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఈ సమస్యకు న్యాయపోరాటం ద్వారా పరిష్కారం తీసుకొచ్చేలా కేసులు వేసే విషయంపై అధ్యయనం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement