Sunday, April 28, 2024

YS Sharmila: రాహుల్, ఖ‌ర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

న్యూఢిల్లీ – యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధినేత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. భర్త అనిల్‌తో కలిసి గురువారం ఉదయం ఎఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్, సోనియా సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం కూడ జ‌రుగుతోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే యోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. ఈ విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో షర్మిల సేవలను కాంగ్రెస్‌ ఉపయోగించుకొనే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌తిపాద‌న‌..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ విషయమై రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో షర్మిల చర్చించారు. ఈ చర్చలు ఫలవంతమయ్యాయని అప్పట్లో ష‌ర్మిల కూడా ప్రకటించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు షర్మిల చేరికను వ్యతిరేకించారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియ వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో షర్మిల ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని కాంగ్రెస్ నేత‌లు భావించిన‌ట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేర‌నున్న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే..
వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతానని ఇప్ప‌టికే ప్రకటించారు. నిన్న తాడేపల్లికి షర్మిల వచ్చిన సమయంలో ఆర్కే కూడ ఆమెతో పాటు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఇన్‌చార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు పార్టీ అధినేత జగన్. ఈ తరుణంలో టిక్కెట్టు దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం సాగుతుంది.

కాంగ్రెస్ కోసం వైఎస్సార్ జీవిత‌కాల పోరాటం..
షర్మిలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేశానని వివరించారు.

నాన్న అడుగు జాడల్లో నడుస్తా
నాన్న వైఎస్సార్‌ అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నాని ష‌ర్మిల అన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అన్నారు. రాహుల్‌ జోడో యాత్ర వల్ల క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ త‌న‌కు ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement