Wednesday, May 22, 2024

AP : అనంత జన కెరటం…జగన్ యుద్ధానికి రాప్తాడు సిద్ధం

అనంతపురం బ్యూరో , (ప్రభ న్యూస్) సీఎం జగన్ సిద్ధం సభకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. సీమ జిల్లాల నలుమూలల నుంచి జనం రావడంతో రాప్తాడు సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేసవి ఎండలు మండుతున్నాయి. 36 డిగ్రీల సెల్సియస్ దాకా ఎండ తీవ్రత నమోదు అయింది. అయినప్పటికీ జనం లెక్కచేయకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి సభా ప్రాంగణానికి తరలి రావడం మొదలుపెట్టారు. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి 44 పై రాప్తాడు మండలం కేంద్రం ఉంటుంది. చెన్నై బళ్లారి బెంగళూరు జాతీయ రహదారి 42 ఇదే దారి గుండా వెళుతుంది. రహదారి మొత్తం పది కిలోమీటర్ల పొడవున పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఫ్లెక్సీలు పోటాపోటీగా కట్టారు.

స్థానిక ఎమ్మెల్యేలతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి సీమవ్యాప్తంగా వస్తున్న పార్టీ కార్యకర్తలు నాయకులకు స్వాగతం పలికారు. పెద్ద పెద్ద బెలూన్లు కట్టి గాలిలో ఎగురవేశారు. మహిళలు, రైతులు, కార్మికులు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టోపీలు అదే కలర్ లో ఉన్న దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. సభా ప్రాంగణానికి తరలి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా తాగునీరు మజ్జిగ పంపిణీ చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి రాకపోకలకు అనుగుణంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీంతో సునాయాసంగా వేదిక ప్రాంతానికి తరలివచ్చారు. ఇది వైఎస్ఆర్ సెంటిమెంట్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ఎన్నికలకు వెళ్లే ముందు అనంతపురంలో భారీ బహిరంగ సభ పెట్టి తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ విషయాన్ని ప్రస్తుతం నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా అనంతపురంలో సభ పెట్టడం వల్ల కచ్చితంగా అధికారంలోకి వస్తారని ఆ సెంటిమెంట్ పనిచేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొన్నారు.

జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభ ఏర్పాట్లను ముందుండి పర్యవేక్షించారు. వాస్తవానికి ఈ సభ 11న జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో నేటికీ వాయిదా పడింది. దీంతో సభను విజయవంతం చేయడానికి మరింత అవకాశం లభించడం వల్ల రాయలసీమ నాలుగు జిల్లాల్లోని కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నుంచి జన సమీకరణ పెద్ద సంఖ్యలో చేయగలిగారు. ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కొందరు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సర్దుబాటు చేసి అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడంలో మంత్రి పెద్దిరెడ్డి సఫలీకృతులయ్యారు.

ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి జనాన్ని తీసుకొచ్చే బాధ్యత 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తీసుకోవడంతో ప్రతి నియోజకవర్గానికి రెండు నుంచి 250 వాహనాల్లో జనాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా ప్రజలు మరో మారు తమ మద్దతును చాటుకున్నారు. వేదిక మీద ప్రసంగించిన వక్తలు తెలుగుదేశం పార్టీ ఇతర ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగట్టారు. వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజల్లో వస్తున్న చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.ఆటాపాట సందడివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన పార్టీ గురించి రాసిన పాటలను పాడి సభకు వచ్చిన వారికి ఉత్సాహపరిచారు.

- Advertisement -

యువకులు పెద్ద పెద్ద జండాలు పట్టుకుని ద్విచక్ర వాహనాల్లో ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నగరంలో ప్రదర్శన చేశారు.

భారీ పోలీసు బందోబస్తు

అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో నిర్వహించిన సిద్ధం సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 16 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలను నిలుపుకున్నారు. 44 నెంబర్ జాతీయ రహదారిపై సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించారు. భారీ వాహనాలను దారి మళ్ళించారు. సిద్ధం సభకు 5000 మంది దాకా పోలీసులు విధి నిర్వహణలో పాల్గొన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement