Sunday, April 28, 2024

AP: పెట్రోల్ పోసుకోబోయిన కార్మికురాలు.. అడ్డుకున్న కార్మికులు…

(ఇబ్రహీంపట్నం ప్రభ న్యూస్) కొండపల్లి మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోటీ కార్మికులతో పట్టణంలో పేరుకుపోయిన చెత్త తరలింపునకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు.

ఇబ్రహీంపట్నం సీఐ పి.శ్రీను, ఎస్సైలు పాపారావు, విజయలక్ష్మి, ధర్మరాజు సిబ్బందికి అక్కడికి చేరుకుని మున్సిపల్ కార్మికులను నెట్టివేసి పోటీ కార్మికులతో చెత్త తొలగింపునకు వాహనాలను పంపే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ కార్మికులు పోలీసులను ప్రతిఘటించారు. ఖిల్లా రోడ్డు సెంటర్ లో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఈ ఆందోళనలో ఓ కార్మికురాలు పెట్రోల్ పంపుతో పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న కార్మికులు, పోలీసులు అడ్డుకుని పక్కకు లాగారు. కొద్దిసేపు పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఓ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయింది. సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.మహేష్ టీ షర్టు చినిగిపోయింది. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఇదే సమయంలో కొంతమంది కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘటనా స్థలంలో మున్సిపల్ కార్మికులు, అధికారులు, పోలీసులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోటీ కార్మికులు చెత్త తొలగింపునకు ప్రయత్నిస్తుండగా మున్సిపల్ కార్మికులు దాడి చేశారు. మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల గాంధీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు బొలివియా ఎట్టి శ్రీకాంత్, టీడీపీ కౌన్సిలర్లు చుట్టుకుదురు శ్రీనివాసరావు, కరిమికొండ శ్రీలక్ష్మి అండగా నిలిచారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రహదారులను శుభ్రం చేయించేందుకు సహకరించాలని మున్సిపల్ కార్మికులకు పోలీసులు నచ్చజెప్పి సమ్మె శిబిరానికి పంపారు. ఎట్టకేలకు ప్రైవేట్ కార్మికులతో చెత్త తరలింపును మున్సిపల్ అధికారులు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement