Friday, May 3, 2024

భ‌గ్గుమ‌న్న విశాఖ కార్మిక లోకం – మోడీ, జ‌గ‌న్ ల దిష్టి బొమ్మ‌లు ద‌గ్ధం..

విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంట్ ను వంద శాతం అమ్మేస్తాం అనే కేంద్ర ప్ర‌క‌ట‌న‌తో కార్మికులు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు….గ‌త అర్ధ‌రాత్రి నుంచే స్టీల్ ప్లాంట్ గేటు వ‌ద్దు కార్మికులు త‌మ ఆందోళ‌న‌లు ఉదృతం చేశారు.. అడ్మిన్‌ భవనం వద్ద కార్మికులు భారీగా మోహరించి నిరసన చేపట్టారు. కేంద్ర‌ మంత్రి ప్రకటనను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన సోమవారం రాత్రి నుంచి కొనసాగుతోంది. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. దీంతో భారీ సంఖ్య‌లో కార్మికులు అక్క‌డికి చేరుకున్నారు..డైరెక్టర్‌ ఫైనాన్స్‌ వేణుగోపాల్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మికుల నిర‌స‌న‌ల‌తో స్టీల్ ప్లాంట్ ప‌రిస‌రాల‌లోప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైజాగ్‌ స్టీల్‌ పరిరక్షణ నినాదాల తో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. ప్రధాని మోడీ డౌన్‌ డౌన్ . జ‌గ‌న్ డౌన్ డౌన్ అంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అటు, జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ మేయిన్‌ గేట్‌ దగ్గర ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజువాక‌, ఆగ‌నంపూడి జాతీయ ర‌హ‌దారుల‌పై కార్మికుల భైటాయించ‌డంతో కిలో మీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి.. ప్రైవేటీ క‌ర‌ణ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకునే వ‌ర‌కూ ఆందోళ‌న‌లు విర‌మించేది లేద‌ని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.. ఇదే స‌మ‌యంలో అధికార‌, ప్ర‌తి ప‌క్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని కార్మికులు డిమాండ్ చేశారు.. రేపు జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల పోలింగ్ ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపు ఇచ్చారు. కార్మికుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో స్టీల్ ప్లాంట్ తో స‌హా న‌గ‌రంలో పలు ప్రాంతాలో భారీ సంఖ్య‌లో పోలీసులు మోహ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement