Sunday, April 28, 2024

సురక్షా క్యాంపెయిన్ లో ధ్రువపత్రాలను జారీ చేయాలి… కలెక్టర్ నాగలక్ష్మి

విజయనగరం, జులై 1 : జగనన్న సురక్షా కార్యక్రమంలో సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే ధ్రువ పత్రాలను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కాంపెయిన్ రోజున, లేదా ఇంకా ముందే వారి దరఖాస్తులను పరిష్కరించాలని, క్యాంపు తర్వాత ఏది కూడా పెండింగ్ ఉండకూడదన్నారు. శనివారం కలెక్టర్ నగరంలోని 1,2,3,4 సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపెయిన్ లకు హాజరయ్యారు. క్యాంపెయిన్ ఎలా నిర్వహిస్తున్నది, ఎన్నెన్ని టోకెన్లు జారీ అయినది వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. మహిళలతో మాట్లాడుతూ… ఈ క్యాంపెయిన్ లో ఏయే సేవలు పొందుతున్నారు, వాలంటీర్లు ఇంటికి వచ్చారా అని ప్రశ్నించారు. మహిళలంతా వారు పొందుతున్న సేవల గురించి కలెక్టర్ కు వివరించారు.

ఇదివరకు ఆలస్యంగా అందేవని, ఈ క్యాంప్ ద్వారా వెంటనే ధ్రువ పత్రాలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎండ ఎక్కువగా ఉన్నందున త్వరగా వారి పనులను పూర్తి చేసి పంపేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ… ఈ క్యాంప్ ద్వారా ఇంతవరకూ 52వేల సేవలకు ఆన్లైన్ లో దరఖాస్తులు నమోదయ్యాయని తెలిపారు. ఎక్కువగా క్యాస్ట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఆధార్ అప్డేషన్ కోసం దరఖాస్తులు వస్తున్నాయని, 11 రకాల సేవలను వేగంగా అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చు లయ యాదవ్, కమిషనర్ శ్రీరాములు నాయుడు, కార్పొరేటర్లు ఆనంద్, అల్లు చాణుక్య, రాజేష్, సత్యగౌరి, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పలు ధ్రువ పత్రాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement