Thursday, May 2, 2024

AP | జనసేన వైపు ‘వంగవీటి’ అడుగులు.. రాజకీయ భవితవ్యంపై ఫోక‌స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ భవితవ్యంపై దృష్టి పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. విజయవాడ రాజకీయాలతో పాటు కాపు సామాజిక వర్గంలో వంగవీటి కుటుంబానిది చెరగని ముద్రంటే ఎటువంటి అతియోశక్తి లేదు. వంగవీటి రంగా మరణం అనంతరం ఆయన వారసుడిగా వంగవీటి రాధా రాజకీయ ఆరంగేట్రం చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లి ఆయన చట్టసభల్లో అడుగు పెట్టని పరిస్థితి నెలకొంది.

అయినప్పటికీ వంగవీటి రాధా బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గ లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన రాధా ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టి మళ్లిd చట్టసభల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నట్లుగా భారీ ప్రచారం జరుగుతోం ది. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కొంత వరకు యాక్టీవ్‌గా పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత కొంత మౌనం వహిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో కూడా రాధా పాల్గొని దాదాపు ఒక గంట పాటు యువనేతతో ఆంతరంగీక సమావేశాన్ని నిర్వహించారు.

ఆ తర్వాత ఆడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్న ఆయన రంగా పుట్టిన రోజు వేడుకల్లో మాత్రం పార్టీలకతీతంగా పాల్గొంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో వంగవీటి రాధా తాజాగా తన ముఖ్య అనుచరులు, రంగా – రాధా మిత్ర మండలికి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్ఛితంగా విజయం సాధించి మళ్లిd అసెంబ్లిdలో అడుగు పెట్టాలన్న ధృడ సంకల్పంలో రాధా ఉన్నట్లుగా అనుచర వర్గం పేర్కొంటోంది. అయితే పోటీ చేసే స్థానంపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీలోనే కొనసాగితే గతంలో పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అధిష్టానం కేటాయిస్తుందన్న ప్రచారం ఒకవైపు జరుగుతోంది. అయితే ఇప్పటికే అక్కడి నుంచి రెండుసార్లు గద్దె రామ్మోహన్‌ వరుస విజయాలు సాధించారు. ఇప్పుడు ఆయన్నీ గన్నవరం నుంచి బరిలోకి దింపుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌ అధిష్టానం ఈ ప్రతిపాదన చేస్తే ఎంతవరకు ఆమోదిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇక సెంట్రల్‌ స్థానాన్ని వంగవీటి రాధా బలంగా ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ స్థానాన్ని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు దాదాపు కేటాయించినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

గత ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో బొండా ఉమా ఆ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో జనసేనలో చేరితే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న భావనలో రాధా అనుచర వర్గం ఉంది. ఈ నేపథ్యంలో రాధాను జనసేనలో చేరాలని అనుచర వర్గం ఒత్తిడి చేస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలన్న యోచనలో ఉన్న రాధా తాజాగా తన అనుచర వర్గంతో భేటీ అయ్యారు. ఈ భేటీ పూర్తిగా రహస్యంగా ఉండటంతో వివరాలు బయటకు రాని పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనా ఆ స్థానం జనసేనకే దక్కుతుందన్న ఆశలో రాధా అనుచర వర్గం ఉంది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను రాధా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా అనుచర వర్గం పేర్కొంటున్నాయి. ఒకవేళ పొత్తుల్లో సీటు దక్కకపోయినా జనసేనలో కొనసాగాలన్న యోచనలో రాధా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 28న రంగా సోదరుడు స్వర్గీయ రాధా జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రాజకీయ భవితవ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న యోచనలో రాధాకృష్ణ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహించిన సమావేశంలో కూడా ఈ కార్యక్రమంపై చర్చించినట్లుగా అనుచర వర్గం పేర్కొంటోంది. ఏదేమైనా వంగవీటి రాధా నిర్వహిస్తున్న ప్రస్తుత సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement