Sunday, April 28, 2024

Delhi | కాళేశ్వరానికి రూ.86 వేల కోట్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం.. నిరూపిస్తే రాజీనామా చేస్తాం: బీఆర్ ఎస్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 86 వేల కోట్లు ఇచ్చామని నిరూపిస్తే తమ పార్టీ లోక్‌సభ ఎంపీలందరం రాజీనామా చేస్తామని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు సవాల్ విసిరారు. గురువారం మధ్యాహ్నం ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తొమ్మిదేళ్లలో అనేక అంశాల్లో ముందంజలో ఉందని చెప్పుకొచ్చారు. బుధవారం లోక్‌సభలో తమ నేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే జోక్యం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ. 86 వేల కోట్లు ఇచ్చామని చెప్డం పూర్తిగా అబద్ధమని ఆయన నొక్కి చెప్పారు. సభను తప్పుదోవ పట్టించిన నిషికాంత్‌పై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీస్ ఇచ్చామని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా తెలంగాణ అనేక అంశాల్లో అగ్రస్థానంలో ఉందని ఆయన వెల్లడించారు.

బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి : నామ నాగేశ్వరరావు
తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయం, చూపిస్తున్న వివక్ష గురించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు పరిస్థితులు, ఆ తర్వాత సాధించిన ప్రగతి గురించి లోక్‌సభలో జరిగిన అవిశ్వాసంపై చర్చలో వివరించానని నామ నాగేశ్వరరావు తెలిపారు. విభజన చట్టంలో చెప్పిన హామీలు కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూల్స్ ఏవీ ఇవ్వలేదని, దీన్ని బట్టే తెలంగాణ మీద ఎంత కోపం ఉందో అర్థమవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్, ట్రైబల్ యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ ఇవ్వలేదనే సంగతి గుర్తు చేశానన్నారు. ఇవన్నీ చెబుతున్న సమయంలో తన మైక్ కట్ చేసి, బీజేపీ ఎంపీ నిషికాంత్‌కి మైక్ ఆన్ చేశారని నామ ఆరోపించారు. ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ. 86 వేల కోట్లు ఇచ్చామని నిషికాంత్ చెప్పడమే కాక ‘ఆన్ రికార్డ్’ అని కూడా అన్నారని విమర్శించారు.

- Advertisement -

తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక అభివృద్ధిలో కేంద్ర నిధులు ఉన్నాయంటున్నారని ఆక్షేపించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చామని నామ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకపోగా, జాతీయ హోదా కల్పించకపోగా అనుమతుల విషయంలో జాప్యం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం వంటి ప్రపంచంలోనే రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ మరెక్కడా లేదని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ అని, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏర్పాట్ల ద్వారానే పూర్తి చేశామని, మూడేళ్ళలో రికార్డ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయగా, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చిందని నామ పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా తప్పు చెప్పిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారన్న మాటలే నిజమని నిరూపిస్తే తమ పార్టీ లోక్‌సభ ఎంపీలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. బీజేపీ వంటి అబద్దాలకోరు పార్టీని తెలంగాణ దరిదాపుల్లోకి రాకుండా తరిమి కొట్టాలని నామ నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

రేవంత్ పిచ్చి మాటలు మానుకోవాలి : రంజిత్‌రెడ్డి
అనంతరం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సబ్సిడీలు ఇవ్వము, రైతులను బలోపేతం చేస్తామంటూ స్వయంగా అమిత్ షా అన్నారని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలిచింది కేసీఆర్, ఇంటింటికి నీరు ఇచ్చింది కేసీఆర్ అని ఆయన అన్నారు. పార్లమెంట్‌కు నిశికాంత్ దూబే తప్పుడు సమాచారం ఇచ్చారని రంజిత్ తెలిపారు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి మంచి ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాల గురించి ఆమె మట్లాడలేరా అని ప్రశ్నించారు. దేశాభివృద్ధికి సహకారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఆర్ధికమంత్రి పార్లమెంట్‌కు చెప్పాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇకనైనా ఆయన పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ వంటి నేతకు పిండ పెడతాననే స్థాయి నీదా అంటూ రంజిత్ రెడ్డి నిలదీశారు.

గొప్పలు తప్ప అవార్డులేవి : కొత్త ప్రభాకర్ రెడ్డి
తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు మీ డబుల్ ఇంజిన్ స్టేట్‌లో ఎక్కడైనా వచ్చాయా అని కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమకు జవాబు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి రూ.86 వేల కోట్లు ఇచ్చామన్న బీజేపీ ఎంపీ, ఆ అప్పు తామే కడతామని ఒప్పుకుంటారా? ప్రధాని ప్రసంగంలో ఆ ప్రకటన చేయిస్తారా అంటూ నిలదీశారు.

కేసీఆర్ మీద కాక మేం చెప్పిన వ్యక్తి మీద గెలువు : వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణకు ఏమాత్రం సహకరించపోయినా సరే కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయాన్నిచ్చి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తోందని వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మణిపూర్ మీద చర్చకు సిద్దంగా లేని ప్రధాని, రెండు సభల్లో ఎలాంటి చర్చ లేకుండా చేశారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ మీద కాదు, తాము నిలబెట్టిన వ్యక్తి మీద గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement