Sunday, April 28, 2024

Exclusive – ఉత్తరాంధ్రలో సీన్ రివర్స్ …అన్ని జిల్లాల్లోనూ టఫ్ ఫైట్


పోటా పోటీ ప్రచారం
గత ఎన్నికల్లో ఫ్యాన్ సుడిగాలి
ఇప్పడు కాస్త ఎదురు గాలి
ఉమ్మడి కూటమికి గంపెశాలు
సిక్కోలు జిల్లాలో హోరాహోరీ
విజయనగరంలో ఏకపక్షం కష్టమే
విశాఖలో నువ్వానేనా

- Advertisement -

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి ) ఏపీలో ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన వేళ.. ఉత్తరాంధ్రాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ మధ్య సమర నాదం మోగింది. ఎన్నికల భేరీకి ముందే ఉత్తరాంధ్రాలో నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం మొదలయ్యింది. సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ తన బలం, బలగాన్ని సిద్ధం చేసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో పులివెందులలో బయలు దేరిన బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాల్లో జన హోరు సృష్టిస్తోంది.

కాగా, యువగళం పేరిట నారా లోకేష్ , ప్రజాగళం పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రాలో తమ గళం వినిపించారు. ఇటు వైసీపీ, అటు కూటమి సభలకు జనం పోటెత్తుతున్నారు. క్షేత్ర స్థాయి సమాచారంతో అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం తమదే విజయం అని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో 28 సీట్లల్లో వైసీపీ.. 6 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా.. ఈ సారి వైసీపీ సింగిల్​గా బరిలోకి దిగితే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బరిలోకి దిగాయి.

సిక్కోలు జిల్లా ఏక పక్షం కాదు

ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చే వేరు.. ఇది టీడీపీకి కంచుకోట. అభ్యర్థులు మారినా జనం మాత్రం సైకిల్ ఎక్కాల్సిందే. 1983 నుంచి టీడీపీకి ఎదురులేదు. కేవలం 2004లో అప్పటి కాంగ్రెస్ అధినేత వైఎస్సార్​ నేతృత్వంలోనే ఇచ్చాపురంలో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 2019 వరకూ టీడిపీకి ఎదురులేదు. బెందాళం అశోక్ టీడీపీ, పిరియా విజయ (వైసీపీ) మధ్యనే ఎన్నికల పోరు జరిగింది. ఇప్పుడు 2024లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మాసుపత్రి చక్రవర్తి రెడ్డి రంగ ప్రవేశంతో ఇచ్చాపురంలో త్రికోణ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. ఇంతకీ ప్రధాన పోటీ ఎవరి మధ్య అనేది సస్పెన్స్ తప్పటం లేదు.

పలాసలో తక్కర్ మార్

పలాస నియోజకవర్గం ఎన్నికలో ఎట్టి పరిస్థితిలోనూ ఏకపక్షం కనిపించదు. ఏ ఎన్నికల్లో ఎవరికీ పలాస ప్రజలు పట్టం కడతారో? అంచానాలు అనూహ్యం. ఇరవై ఏళ్ల ఎన్నికల సరళి పరిశీలిస్తే.. 2009లో టీడీపీ అభ్యర్థి గౌతు శ్యాం సుందర్ శివాజీపై కాంగ్రెస్ అభ్యర్థి జుట్టు జగన్నాయకులు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రం కాగా వైసీపీ అభ్యర్థి వజ్జ బాబురావుపై టీడీపీ అభ్యర్థి గౌతు శ్యాం సుందర్ శివాజీ విజయం సాధించారు. ఇక 2019లో మళ్లీ కథ మారింది. టీడీపీ అభ్యర్థికి విజయం దక్కలేదు. వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పల రాజు గెలిచారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీదిరి అప్పలరాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ కొనసాగిస్తుంటే.. ఈ సారి టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ గొడుగుతో మజ్జి త్రినాథ్ బాబు నేను సైతం సై అంటున్నారు.

టెక్కలి కోటలో హోరాహోరీ

టెక్కలి నియోజకవర్గం అంటే చాలు.. టీడీపీ వ్యవస్థాపకుడు నటసార్వభౌముడు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. పసుపు కోటగా అవతరించింది. కానీ 2004, 2009లో దివంగత వైఎస్ఆర్ అడ్డగా మారిపోయింది. మళ్లీ 2014 నుంచి పసుపు సేనకే జనం పట్టం కడుతున్నారు. తాజాగా టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చె నాయుడు ను ఓడించటమే ధ్యేయంగా వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నారు. 2014లో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్ పోటీ ఇచ్చారు. మరి ఇక్కడ అచ్చెనాయుడు తన సత్తా చూపుతారా? లేదా? అనేది ప్రస్తుత ప్రశ్నార్థకంగా ఉంది.

పాతపట్నంలో పాత కథ చెరిగినట్టే

పాతపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా శత్రుచర్ల విజయరామరాజు, కలమట వెంకట రమణ మూర్తి మధ్య జరిగిన ఆధిపత్య పోరాట చరిత్ర మారింది. కానీ కలమట వెంకట రమణ మూర్తి మాత్రం ఇంకా తన సత్తాను ప్రదర్శిస్తున్నారు. 2009, 2014లో వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. 2019లో రెడ్డి శాంతి తెరమీదకు వచ్చారు. పాత తరం నేతకు చుక్కలు చూపించారు. 2024లో ఎన్నికల సరళి మారిపోయింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, టీడీపీ నుంచి మామాడి గోవింతరావు , కాంగ్రెస్ నుంచి కొప్పురోతు వెంకట్రావు పోటీ పడుతున్నారు. 2014 నుంచి వైసీపీ గడ్డగా మారిన పాతపట్నం.. ఈ ఎన్నికల్లోనూ తన ప్రతాపం నిరూపిస్తుందా? లేక కూటమి దెబ్బకు కుదేలవుతుందా వేచి చూడాల్సిందే.

శ్రీకాకుళం అంటే ధర్మాన గడ్డ

సిక్కోలు నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావుకు తిరుగులేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో గుండ లక్ష్మీదేవిపై ఓడిపోయారు. 2019లో అదే అభ్యర్థినిపై విజయం సాధించి ఏపీ సర్కారులో కీలక మంత్రి పదవిని చేపట్టారు. 2024లో ఈ సారి టీడీపీ అభ్యర్థి మారారు. గొండు శంకరరావు టీడీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావుపై పోటీకి దిగారు. మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పైడి నాగభూషణం పోటీ చేస్తున్నారు. ఈ దశలో ధర్మాన ప్రసాద రావు తిరిగి తన సత్తా చాటుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఆముదాల వలస ఉద్దండులదే

ఆముదాల వలస .. ఈ నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ మధ్యే అసలు సిసలు పోటీ తప్పటం లేదు. 2009లో తమ్మినేని సీతారాం స్వతంత్ర అభ్యర్థిగా తన సత్తాను చూపించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు. కూన రవికుమార్ తెలుగు దేశం అభ్యర్థిగా తన బలాన్ని ప్రదర్శిస్తున్నారు. 1983 నుంచి ఆముదాల వలస రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరొందిన తమ్మినేని సీతారాంను ఎదుర్కోవటం సాధాసీదా వ్యవహారం కాదు. అలాగని కూన రవికుమార్ శక్తిని తక్కువగా అంచనా వేయటం తగదు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ తప్పదని రాజకీయ పరిశీలకుల అంచనా.

విజయ నగరంలో ఏక పక్షం కష్టమే…

2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. 10 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ టీడీపీకి సింగిల్ డిజిట్ దక్కలేదు. పసుపు కోటలో మరోసారి జెండా ఎగరవేయాలని టీడీపీ తపించిపోతోంది. కానీ ఐదారు స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య టప్ ఫైట్ తప్పటం లేదు. త్రికూటమి జత కలిసినా.. వైసీపీ బలాన్ని నీరు గార్చటం కష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం ఎంత వరకూ తమ సత్తా చూపుతాయో వేచి చూడాల్సిందే..

రాజధానిపై ఆశలు ఫలించేనా?

కార్యనిర్వాహక రాజధానిగా అవతరిస్తున్న విశాఖపట్నంపై వైసీపీ ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయో?నని రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు మీద విశ్లేషణలు వల్లిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 11 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. వైసీపీ ఫ్యాన్ గాలిలో ఎన్నో జిల్లాల్లో టీడీపీ కొట్టుకు పోయినా విశాఖ జిల్లాలో తన ఉనికిని కోల్పోలేదు. తాజాగా జనసేన, బీజేపీ కూటిమితో విశాఖ జిల్లాల్లో తన సత్తా చూపించాలని టీడీపీ తెగ ఆరాటపడుతోంది. ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ తమ సత్తాను నిరూపించుకుని విశాఖపట్నం కేంద్రంగా రాజధాని తరలింపులో విజయం సాధించాలని వైసీపీ ఆరాట పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement