Sunday, April 28, 2024

Top Story – అల పిఠాపురంలో…పవన్ విజయం ఏకపక్షమేనా!!!

వైసీపీలో అలజడి
జనసేనాని ఓటమే టార్గెట్
కాంగ్రెస్ తోనే ఫ్యాన్ కు గండం
ముద్రగడ సహా కీలక నేతల మోహరింపు
కాపుల మధ్య తీవ్ర పోటీ
ఇది జనసైనికుల నినాదం
టీడీపీ, బీజేపీ మద్దతు సరే సరి
వర్మ వర్గమే అసలు బలగం
లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యమేనా?
ఇంతకీ తటస్థుల మనోగతం ఏమిటో?
క్షణక్షణం సస్పెన్స్

ఏపీలో ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పొలిటికల్ వార్ హాట్ టాపిక్ గా మారింది. అభినవ, అభినయ గోపాలుడి పాత్రలో చిటికిన వేలుపై కేంద్ర, రాష్ర్ట రాజకీయాలను గిరి గిర తిప్పుతున్న జనసేన సైన్యాధిపతి పవన్ కళ్యాణ్ ఈ బరిలో దిగటంతోనే… ఏపీ రాజకీయాల్లో ఎనలేని వేడి రగిలింది. ఆయనపై వంగా గీత అనే మహిళ నేత వైసీపీ బాణంగా దూసుకు వస్తుంటే.. ఆ అస్ర్తాన్ని పవన్ కళ్యాణ్ తిప్పికొడతారా? లేక కూలపడతారా? అనే అంశాలపై ఏపీలో బెట్టింగ్ రాయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీ ఖాయమని తెగేసి చెబుతుంటే.. పిఠాపురం ప్రజల మనోగతి ఎలా ఉంది? పవన్ గాలితో చేదతీరుతారా? లేక ఫ్యాన్ గాలితో పవన్ కళ్యాణ్కు దిమ్మతిరిగే షాక్ ఇస్తారా? అంచనాలకు అందని ఊహాగానాల్లో రాజకీయ పండితులు సతమతమవుతున్నారు.

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – నిజం..నిజంగా నిజం. పిఠాపురంలో ఎన్నికల పోరు ఏక పక్షమా? హోరాహోరీ పోరా? అనే అంశం రాజకీయ పరిశీలకులకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈ సారి భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే అంచనాలను తలకిందులు చేస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయటానికి నిర్ణయం తీసుకోవటంతో .. ఈ సీటుకు అనూహ్య వెయిటేజీ పెరిగింది. పొలిటికల్ హీట్ పెరిగింది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో 2.30 లక్షల పైగా ఓట్లు ఉంటే,,, ఇందులో ఏకంగా 91,000 ఓట్లు కాపు సామాజిక వర్గానివే. అంటే నలభై శాతానికి పైగా ఒకే సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయన్నమాట. మొదటి నుంచి పిఠాపురంలో కాపులదే రాజ్యం. పార్టీలు వేరు అయినా సామాజిక వర్గం మాత్రం అదే కావడం విశేషం.

ఇక 1952 నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తే అన్ని ఎన్నికలూ ఆసక్తి కరమే. అంతే కాదు హోరా హోరీ పోరుతో సాగినవే. ఇక మెజారిటీలు చూస్తే ఎపుడూ ఇరవై వేలను పై దాటినవి లేవు. కానీ 2014లో మాత్రం ఏకంగా 47, 800 ఓట్ల మెజారటీ వచ్చింది. ఈ మెజారిటీని గత చరిత్రలో సాధించలేదు. పిఠాపురంలో ఇప్పటికి పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఇందులో సగం మెజారిటీ కూడా దక్కలేదు. కానీ పిఠాపురం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎస్వీఎస్ ఎన్ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బంపర్ మెజారిటీ విజయం సాధించారు. నిజానికి ఆనాడు టీడీపీ, వైసీపీలను పక్కన పెట్టి మరీ వర్మ గెలవటం చారిత్రాత్మక విజయమే. ఐతే, ఇంత పెద్ద సామాజిక వర్గంలోనూ తీవ్ర పోటీ ఉందనేది నిర్వివాదాంశం. కాపులు కాపులకే మద్దతు ఇస్తారంటే.. అది కేవలం ఊహాగానమే. ప్రజలకు ఎవరు నచ్చితే వారికే కులాలకతీతంగా మద్దతు పలుకుతారని పిఠాపురం జనం నిరూపించారు.

గతంలో కాపుల మధ్యే తీవ్ర పోటీ

పిఠాపురం రాజకీయ చరిత్రలో కాపు సామాజికవర్గం భిన్న ధృవాలుగా పోటీపడిన వైనమే కనిపిస్తన్న స్థితిలో ఇపుడు పవన్ కళ్యాణ్కు లక్ష మెజారిటీ ఖాయం అని జనసేన సైనికులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతమూ లక్షకు మెజారిటీ తగ్గకూడదు అని అంటున్నారు. ఇక్కడ ఒకటే అస్ర్తం ఈ ఒక్కసారి మన మనిషిని రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేయాలనే అభిలాషే ఈ సామాజిక వర్గంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ భీమవరం, గాజువాక చరిత్ర పునరావృతం కాకూడదని జనసేన వర్గం ప్రచారం చేస్తోంది. మరి అదే నిజం అవుతుందా లేక మెజారిటీలు మారుతాయా లేక ప్లాన్ బీ ఫలించి వైసీపీ నెగ్గుతుందా అనేది సమాధానం లేని ప్రశ్న.

వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె 2009లో వేయి ఓట్ల తేడాతోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాపుల నేత ముద్రగడ పద్మనాభం, క్షత్రియ నేత వర్మ కూడా పోటీ చేశారు. ఇందులో వంగా గీతకు 46,423 ఓట్లు, ముద్రగడ పద్మనాభానికి 43,431 ఓట్లు, వర్మకు 45,587 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఎన్నికల్లో 80 వేల కాపుల ఓట్లు దాదాపు సరిసమానంగా విడిపోయాయని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇక 2014లో వైసీపీ అభ్యర్థిపై వర్మ 45వేల ఓట్ల మెజారిటీ గెలిచినా.. 2019లో దొరబాబుపై 14,992 ఓట్ల మెజారిటీతో ఓడిపోగా.. జనసేనకు 28011 ఓట్లు వచ్చాయి.

- Advertisement -

ఈసారి ఏకపక్షమేనా..

అయితే .. 2024లో పవన్ కళ్యాణ్ గెలుపు ఎంత నిజమో… ఓటమి అంతే నిజమని వైసీపీ వాదిస్తోంది. పైగాఈసారి తాను బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతానని వంగ గీత సవాల్ విసురుతున్నారు. దీనికి తోడు పిఠాపురంపై మొత్తం బలగాలతో వైసీపీ మోహరిస్తోంది. భారీ వ్యూహ రచన చేస్తోంది. పవన్ కళ్యాణ్ను ఒక మహిళతో ఓడించాలన్న పంతంతో పనిచేస్తోంది. బీసీలను ఎస్సీలను ఇతర సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకుంటోంది. మరి వైసీపీ వర్సెస్ జనసేన పోరులో ఎవరు నెగ్గుతారు. ఎవరు అత్యధిక మెజారిటీ సాధిస్తారు అన్నది ఉత్కంఠను రేపుతోంది. పిఠాపురంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీటు గల్లంతు కావటం, ఎంపీ స్థానం నుంచి వంగ గీతను రంగంలోకి దించటం వైసీపీకి పెద్ద మైనస్ పాయింటే. గత ఎన్నికల పోలింగ్ సరళితో బేరీజు వేస్తే… పవన్ కళ్యాణ్ గెలవటం తథ్యం.. ఎందుకంటే.. ఆయన గెలుపు బాధ్యతను వర్మ భుజానికి ఎత్తటంతో.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోరాటం ఏకపక్షమేనని రాజకీయ పరిశీలకులు అంచావేస్తున్నారు.

పవన్ ఓటమే వైసీపీ టార్గెట్

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమే వైసీపీ ప్రధాన లక్ష్యం కావటంతో… ఇక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించటమే ఈ కీలక నేతల బాధ్యత. ఇటీవల వైసీపీలో చేరిన కాపునేత ముద్రగ్రడ పద్మనాభం క్యాంపెయిన్ స్టార్ కాగా.. మరో ముగ్గురు కీలక నేతలను ఇంచార్జ్‌లుగా వైసీపీ నియమించింది. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి.. కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా..గొల్లప్రోలు మండలం బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబు.. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పే బాధ్యతలు ముద్రగడకు.. వీరు ముగ్గురే కాక.. నియోజకవర్గానికి ప్రత్యేక ఇంచార్జ్‌గా ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. ఒక్కో నేతకు ఒక్కో టాస్క్.. మండలాల ఇంచార్జ్‌లు అన్ని వర్గాలతో చర్చలు జరపడం.. ఆ మండలాల్లో వైసీపీకి సానుకూల పరిస్థితులుగా మార్చడం..ఆర్థికపరమైన అంశాలను చూసుకునేందుకు ద్వారంపూడి..ఇక కాపు నేతలను సముదాయించే పని ముద్రగడకు.. ఇలా సరికొత్త వ్యూహంతో పవన్‌కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారు..
అటు జనసేన, ఇటు వైసీపీ కూడా ఆపరరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపారు పిఠాపురంలో.. ఏకంగా వైసీపీ అభ్యర్థి వంగా గీతను జనసేనలో చేరాలని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. కానీ వైసీపీ మాత్రం జనసేన, టీడీపీ నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది.. ఇదంతా పవన్‌కు భయపడి చేస్తున్నారా? లేదంటే ఎలాగైనా ఓడించాలనే కసితో చేస్తున్నారా? మరి ఏ పార్టీ వ్యూహం ఫలిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఇవీ రాజకీయ విశ్లేషకుల ప్రశ్నలు .

పొత్తుల బలమే కాదు… తటస్థ ఓటర్లే దేవుళ్లు

2019 పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు – 1,86,682 (83 శాతం) పోల్ అయ్యాయి. వైసీపీ -అభ్యర్థి పెండెం దొరబాబుకు – 83,459 (44 శాతం) ఓట్లు, టీడీపీ – అభ్య ర్థి ఎస్వీఎస్ఎస్ వర్మ – 68,467 (36 శాతం) – ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి – మాకినీడి శేషు కుమార్ ‌‌- 28,011 (15 శాతం) ఓట్లు వచ్చాయి. 14,992 ఓట్ల మెజారిటీతో దొరబాబు గెలిచారు. అంటే గత ఎన్నికల్లో టీడీపీకి 36 శాతం, జనసేనకు 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండూ ఆయా పార్టీల అసలు ఓట్లే. అంటే ఈ రెండు పార్టీలు కలిస్తే 51 శాతం ఓట్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తోడు కావటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలవటంతో విజయం ఖాయమని జనసైనికులు అంచనా వేస్తూ.. భారీ మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగితే ఓటు బ్యాంకు చీలే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఇక్కడ కాంగ్రెస్ వాదులు వైసీపీకే గతంలో ఓటు వేశారు. ఈ సారి వైసీపీ నుంచి ఓట్లు చీలితే.. అవి కాంగ్రెస్ పార్టీవే.. అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎనీ హౌ… పిఠాపురం కాపు క్రాస్ ఓటింగ్ పై వైసీపీ ఎన్ని ఆశలు పెట్టుకున్నా… ఈ బలం తమదేనని జనసేన మితిమీరిన ఆత్మవిశ్వాసంతో లక్ష మెజారిటీ లక్ష్యంతో అడుగులేసినా,, .. తటస్థ ఓటర్లే ఈ రెండు పార్టీలకు కనిపించని దేవుళ్లంటే ..అంగీకరించక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement