Monday, December 9, 2024

Top Story – రాజ‌కీయాల్లోకి శ్యామ‌ల‌మ్మ‌!— రెబల్ స్టార్ సతీమణికి ఆహ్వానం

(ఏలూరు బ్యూరో, ప్రభన్యూస్) – పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ రాజకీయాలు సుదీర్ఘకాలంగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య కొన‌సాగుతున్నాయి. ఒకే సామాజిక వర్గంలో నడుస్తూ వస్తున్నాయి. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక్కడ నుంచే పోటీ చేయగా.. ఆ తర్వాత బీజేపీలో కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లి మొగల్తూరు మొనగాడిగా దేశ రాజకీయాల్లో ఓ పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత గోకరాజు గంగరాజు నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన కనుమూరు బాపిరాజు కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి గెలుపొందిన వారే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిత్యం తలనొప్పిగా మారిన ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా ఇదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. వీరంతా పార్టీలు వేరైనా ఒకే సామాజిక వర్గం నుంచి, ముఖ్యంగా ఒకే కుటుంబమూలాల నుంచి వచ్చిన వారే.

శ్యామ‌ల‌మ్మ‌ను స్వాగ‌తిస్తున్నా పార్టీలు..
తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికలు స‌మీపించిన వేళ‌.. వైసీపీ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారుతుండగా.. కొత్త అభ్యర్థి కోసం వైసీపీ య‌త్నిస్తోంది . రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌ని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే జనవరి 20న కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన సతీమణి శ్యామలాదేవి తన కూతురుతో పాటు సొంతూరు మొగల్తూరులో కార్యక్రమం నిర్వహించారు. ఒకరోజు ముందుగానే జనసేన పార్టీ నుంచి నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ బొమ్మిడి నాయకర్ పార్టీ నాయకులతో కలిసి శ్యామలాదేవితో భేటీ అయ్యారు. దీంతో పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న శ్యామలాదేవిని జనసేనలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తులో జనసేన ఉన్న నేపథ్యంలో శ్యామలాదేవి ఏ పార్టీలోకి వెళ్తారనే చ‌ర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. అయితే.. రఘురామ కృష్ణం రాజు జనసేన టీడీపీ, బీజేపీ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుండి పోటీ చేస్తారని తెలుస్తుండగా.. మరి శ్యామలాదేవి ఈ కూటమిలో చేరితే ఎంపీ సీటు దక్కని పరిస్థితి ఉందని.. మరి పొలిటికల్ ఎంట్రీ ఎందుకని మరికొందరు అంటున్నారు.

ఆఫ‌ర్ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..
రఘురామకృష్ణం రాజుపై పోటీగా శ్యామలాదేవిని వైసీపీ నుండి బ‌రిలో దింపాల‌ని ఆఫర్ ఇచ్చేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి పార్టీలో కీలక నేత నుంచి ఆహ్వానం పంపారని.. కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇంకా సమాధానం వెళ్లలేదని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఇదే నర్సాపురం ప్రాంతానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన మద్దతు ఉండడంతో.. వైసీపీ నుండి కృష్ణంరాజు సతీమణి అయితే ఇదే ప్రాంతానికి చెందిన ప్రభాస్ చరిష్మా వైసీపీకి ఎంతగానో ప్రయోజనం అని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయ అరంగెట్రం.. వ్య‌తిరేకించ‌ని శ్యామ‌లాదేవి
కృష్ణంరాజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్న శ్యామలాదేవి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగేందుకు సానుకూలంగానే ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అయితే.. అది వైసీపీ నుండి అనేది మాత్రం చెప్పలేమని నర్సాపురం, మొగల్తూరులో రెబల్ స్టార్ అభిమానులు అంటున్నారు. అలా అని వైసీపీ ఆహ్వానాన్ని ఇంకా శ్యామలాదేవి తిరస్కరించకపోవడం కూడా చ‌ర్చ‌కు ఉన్న‌ట్టు తెలుస్తోంది . ఈ సందర్భంలో కృష్ణంరాజు జయంతి వేడుకల్లో ఆమె మొగల్తూరులో పాల్గొనడం, ఉచిత మెడికల్ క్యాంపును షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్ర‌త్యేక శిబిరం ఏర్పాటు చేయడం రాజకీయ సానుకూల పవనాలకు తెరలేపింది. ప్రస్తుతం కృష్ణంరాజు జయంతి కోసం మాత్రమే మొగల్తూరు వచ్చానని, రాజకీయాల కోసం ఏ విధమైన వ్యాఖ్యలు చేయనని శ్యామ‌లాదేవి చెబుతున్నారు.

నెలాఖ‌రులోగా మ‌రోసారి మొగ‌ల్తూరుకు..
ఈ నెలాఖరులో మళ్లీ మొగల్తూరు వస్తానని.. అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతా అంటూ శ్యామ‌లాదేవి సమాధానం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. దీంతో కచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే వైసీపీ నేతల ఆహ్వానం, జనసేన నాయకులతో భేటీ.. ఈ రెండు పార్టీలతో పాటు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.. కృష్ణంరాజుకు రాజకీయ శిష్యుడు కావడంతో శ్యామలాదేవితో ఆయన భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు కృష్ణంరాజు రాజకీయ అనుచరుడిగా బండారు మాధవ నాయుడు ఉండగా.. మళ్లీ ఆయన నరసాపురం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో కృష్ణంరాజు కుటుంబం రంగంలోకి దింపి మద్దతు పలుకుతుందా.. లేక స్వయంగా కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి రాజకీయాల్లోకి వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement