Wednesday, May 1, 2024

Tirumala | భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల , ప్రభన్యూస్‌ : తిరుమల గిరులు శనివారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నడకదారి, రోడ్డు మార్గాన పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటుండడంతో సప్తగిరులపై ఎటుచూసిన భక్తులతో బారులు తీరిన క్యూలైన్‌లే దర్శనమిస్తున్నాయి. దీంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనంకోసం భారీగా భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1,2 లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్‌లు వెలుపలకు వ్యాపించాయి.

శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 2 లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండి ప్రస్తుతం సర్వదర్శన క్యూలైన్‌ ఏటిసి వైపు నుంచి ఏటిజిహెచ్‌ వద్దకు వ్యాపించింది. సుమారు కిలోమీటర్‌ మేర భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు. ఇక కాలినడకన భక్తులు ప్రవాహంలో తిరుమలకు తరలివస్తున్నారు. తమ మొక్కులు చెల్లింపులో భాగంగా పెద్ద సంఖ్యలో నడకమార్గంలో భక్తులు తరలివస్తుండడంతో కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం టోకెన్ల కోటా పూర్తవ్వడంతో కాలినడకన తిరుమలకు చేరుకుంటున్న

- Advertisement -

భక్తులు సర్వదర్శనం ద్వారానే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉండడంతో సర్వదర్శనం క్యూలైన్‌ అంతకంతకు పెరిగిపోయింది. వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్నారు. శ్రీవారి ఆలయంలో కేవలం సర్వ, దివ్య, ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగివున్న భక్తులను మాత్రమే టిటిడి దర్శనానికి అనుమతిస్తోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో స్వామివారిని సర్వదర్శనం గుండానే దర్శించుకోవాలంటే 24 గంటలకు పైగా సమయం పడుతుంది. దర్శనం కోసం క్యూలైన్‌లో వేచివున్న భక్తులకు టిటిడి అన్నదానం అధికారులు శ్రీవారి సేవకుల సహాయంతో ఎప్పటికప్పుడు తాగునీరు, అల్పాహారం లాంటిని నిరంతరాయంగా అందచేస్తున్నారు. కాగా అధికారులు ఎప్పటికప్పులు క్యూలైన్‌లను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement