Monday, April 29, 2024

Delhi | పోషణ్ అభియాన్ పథకం అమలులో వివక్ష.. తెలంగాణకు స్వల్ప నిధులతో అన్యాయం : నామ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు ఆరోపించారు. గర్భిణీలు, పిల్లలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన పోషణ్ అభియాన్ పథకం విషయంలో తెలంగాణకు చాలీచాలని నిధులు కేటాయించారని మండిపడ్డారు. శనివారం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి లేఖ రాసిన నామ నాగేశ్వర రావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అందులో వివరించారు.

.

- Advertisement -

36 రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.5,07,909.64 లక్షలు కేటాయించగా అందులో  తెలంగాణకు కేవలం రూ 17,905.85 లక్షలు మాత్రమే కేటాయించారని అన్నారు. ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా స్వల్పమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 25,498.6 లక్షలు, గుజరాత్ కు రూ. 27,433.24 లక్షలు, మధ్యప్రదేశ్ కు రూ.37,515.12 లక్షలు, మహారాష్ట్రకు రూ.55,901.99 లక్షలు, ఉత్తర ప్రదేశ్ కు రూ.48,662.91 లక్షలు, బీహార్ కు రూ.46,558.29 లక్షలు  కేటాయించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలియజేయాలని ఎంపీ నామ కోరారు.

ఈ పధకం కింద గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఖర్చు చేసిన నిధుల వివరాలను రాష్ట్రాల వారీగా వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో ప్రసవం అయిన తర్వాత తల్లికి 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ను అందిస్తున్న తరహాలో పథకాలను దత్తత తీసుకొని అమలు చేయాలని కేంద్రం ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆమలు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి, రెండో సంతానంగా ఆడ పిల్ల పుడితే నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement