Wednesday, May 1, 2024

India | ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే నిరుద్యోగం తక్కువ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే నిరుద్యోగం తక్కువగా వుందని, భారత్‌లో నిరుద్యోగం 3.3 శాతం మాత్రమేనని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి భగవంత్‌ ఖూబా అన్నారు. ఇక్కడి ఆర్టీసీ కళా భవన్‌లో శనివారం నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి 135 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఎయిమ్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌ఐసీ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాంటి ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఈ సందర్భంగా నియామక పత్రాలు నుంచి అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళలో పారదర్శక విధానాల ద్వారా చేపట్టిన చర్యల కారణంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా జీడీపీ 7.5 శాతానికి పెరిగిందని, ద్రవ్యోల్బణం 4.2కు తగ్గిందని అన్నారు. గత తొమ్మిదేళ్ళలో పేదల జీవితాలు మెరుగుపడ్డాయని, 15 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖ పైకి వచ్చారని పేర్కొన్నారు. ముద్రా యోజన ద్వారా 40 కోట్లమందికి రుణాలు లభించగా ఇందులో అత్యధిక శాతం మహిళలే లబ్దిపొందారని చెప్పారు. నాలుగు కోట్ల మంది పేదలకు ఇళ్ళు, 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

పేదల జనధన్‌ ఖాతాలలో లక్షా తొంభై వేల కోట్ల రూపాయిలు జమ అయ్యాయని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు ఇస్తున్న ప్రతి రూపాయి వారికే అందుతోందని చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతతో ‘సబ్‌ కా సాత్‌’ నినాదంతో దేశం ప్రగతిశీల దేశంగా పురోగమిస్తోందన్నారు. మరే దేశంలో లేని విధంగా భారత్‌లో 92 కోట్లమంది 18-59 ఏళ్ళ మధ్య వారున్నారని పేర్కొన్న ఆయన మానవ వనరులను గరిష్టంగా ఉపయోగించుకుంటూ, 2047 నాటికి భారత్‌ ప్రపంచంలొనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందన్నారు.


కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలుచేస్తున్న విధానాల వల్ల నిరుద్యోగం గణనీయంగా తగ్గిందని, అయితే తెలంగాణాలో మాత్రం నిరుద్యోగం 7.5 శాతం ఉందన్నారు. అవినీతికి తావు లేకుండా, ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్‌ విభాగం చీఫ్‌ కమిషనర్‌ సందీప్‌ ప్రకాష్‌, కమిషనర్‌ సంగీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement