Sunday, April 28, 2024

AP: అమ్మ‌…. నేను భార‌మయ్యానా….

సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధానికి అర్థం లేకుండా పోతుంది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన పడేసి వెళుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సైతం సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి అమానుష ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

అవ‌నిగ‌డ్డ‌లో అప్పుడే భూమ్మీద పుట్టిన పసికందును అవనిగడ్డ ఒకటో వార్డులోని చర్చి వెనక పడేసి వెళ్లారు. అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

లోకం పోకడ తెలియని ఆ పసికందుపై అమానవీయంగా ప్రవర్తించారు. పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు కంటికి కడివెడు రోదిస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది జంటలు ఉన్న నేటి రోజుల్లో, పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఈ విధమైన ఘటనలకు పాల్పడుతుండటంతో ఈ ఘటనలు రక్త సంబంధాలను సైతం ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement