Saturday, May 4, 2024

తగ్గనున్న వరి సాగు.. గిట్టుబాటు ధర లేకపోవడమే కారణం

అమరావతి, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి రక్తాన్ని స్వేదంగా మార్చి అన్నదాతలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించక పోవడం .. దీనికి తోడు పెరిగిన కూలీ, డీజిల్‌, ఎరువుల ధరలు… ప్రకృతి వైపరీత్యాలు… ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించకపోవడం వెరశి రైతులు వరి సాగు పట్ల మక్కువ చూపడం లేదు. ఏడాదికేడాది రాష్ట్రంలో వరి సాగు తగ్గుతోంది. వరి ప్రధానంగా పండించే కొన్ని జిల్లాల్లో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించిన విషయం విదితమే. వ్యయసాయ శాఖ అక్కడి రైతాంగానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ లో వ్యాప్తంగా ఖరీఫ్‌ వరి సాగులో తగ్గుదల కనిపిస్తోంది. జూలై 1 నాటికి నిరుటి కంటే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 27 శాతం తక్కువ విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. ఈ పరిస్థితి ధాన్యాగారంగా, అన్నపూర్ణగా అభివర్ణించే ఆంధ్రప్రదేశ్‌లోనూ నెలకొంది. వరి సేద్యం పట్ల రైతులు అంతగా ఆసక్తి చూపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఎరువుల ధరల పెరుగుదల, అదనుకు కావాల్సిన ఎరువులు దొరక్క పోవడం, ధాన్యానికి మెరుగైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటించకపోవడం, పెరిగిన డీజిల్‌, కూలీల ధరలతో ఖర్చులు అధికం కావడంతో పెట్టు-బడి ఖర్చులు పెరగడం వలన అన్నదాతలు వరి సాగుపై విముఖత చూపుతున్నట్లు- తెలుస్తోంది. ఈ ధోరణి స్థిరపడితే ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ఆహార మంత్రి పీయూష్‌ గోయల్‌, రైతులతో వరి సాగును రాష్ట్రాల్రు ప్రోత్సహించాలని, వీలైన మేరకు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పగా, ఆదిలోనే సాగు తగ్గుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. జులై ఒకటి నాటికి దేశ వ్యాప్తంగా 43.45 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ఇదే సమయానికి 59.56 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. నిరుటి కంటే 16.11 లక్షల హెక్టార్లలో (27.05 శాతం) వరి నాట్లు తగ్గాయి.

వరి సాగుకు డిఎపి, ఎంఒపి, ఎన్‌-పి-కె ఎరువులు అవసరం కాగా వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఏడెనిమిది మాసాలుగా ఎరువుల సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. లభ్యత సరిగ్గా లేదు. డిఎపి, పొటాష్‌ కొరత తీవ్రంగా ఉంది. సమ యానికి సరిపడా సరఫరా లేకపోవడంతో బ్లాక్‌ మార్కెట్‌ తలెత్తింది. ఈ సమస్యలతో రైతులు వరి వేయలేకపోతున్నారు. ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎరువుల రేట్ల పెరుగు దలకు అంతర్జాతీయ విపణిని కేంద్రం సాకుగా చూపిస్తోంది. భారీ సబ్సిడీలతో ధరలను నియంత్రి స్తున్నామంటూ వైఫల్యాన్ని సమర్ధించుకుంటోంది. ఈ నేథ్యంలోనే రాష్ట్రంలోనూ వరి నాట్లు తగ్గాయి. జులై 6 నాటికి 1.74 లక్షల హెక్టార్లలో పడాల్సి ఉండగా 90 వేల హెక్టార్లలోనే వేశారు. ఇదే సమయానికి రెండేళ్ల క్రితం99 లక్షల హెక్టార్లలో పడగా గతేడాది 1.14 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌లో వరి సాగు లక్ష్యం 16.30 లక్షల హెక్టార్లు. గత సంవత్సరం ఖరీఫ్‌లో అంత విస్తీర్ణంలో సాగైంది. కాగా సాధారణ విస్తీర్ణం 15.59 లక్షల హెక్టార్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాదికి మూడు పంటలని, వేసవి పంటలని, తుపాన్ల నష్టాన్ని అధిగమించేందుకు ముందస్తుగా డెల్టా కాల్వలకు నీళ్లని ప్రభుత్వం చెప్పగా వరి సాగులో జాప్యం నెలకొంది.

గతేడాది ఖరీఫ్‌లో విపత్తుల వలన దిగుబడి బాగా తగ్గింది. తొలుత హెక్టారుకు 4,933 కిలోల ఉత్పాదకతను ఆశించగా చివరికొచ్చేసరికి 4,351 కిలోలకు ఉత్పాదకత పడిపోయింది. ఆ వారా ముందుగా వేసిన ఉత్పత్తి అంచనా 80.46 లక్షల టన్నుల నుండి 70.96 లక్షల టన్నులకు తగ్గింది. దాదాపు పది లక్షల టన్నులు తగ్గాయి. రబీలో బోర్లు, లిప్టలు, కృష్ణా డెల్టాలో వరి సాగును నియంత్రించడంతో విస్తీర్ణం మునుపటి రబీ కంటే రెండు లక్షల హెక్టార్లలో తగ్గింది. మరోవైపు ఖరీఫ్‌, రబీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగలేదు. ఇ-క్రాప్‌ వంటి నిబంధనలతో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువకు వ్యాపారులు, దళారులకు తెగనమ్ముకొని నష్టపోయారు. ఇప్పటికీ చాలా చోట్ల ఖరీఫ్‌, రబీలో కొన్న ధాన్యానికి ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదు. ఆర్‌బికెలన్నప్పటికీ ఎరువుల కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌తో రైతులు ఇబ్బందులెదుర్కొంటూనే ఉన్నారు. ఆ ప్రభావం వరి సాగుపై పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆహారభద్రత, రాష్ట్ర ఆనవాయితీ, రైతుల ఆదాయానికి కనీస గ్యారంటీ- ఇచ్చే వరి సాగును ప్రభుత్వం విరివిగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement