Saturday, May 18, 2024

కొత్త జిల్లాల్లోనూ పాత పాలనే.. కొద్దిరోజులు ఇదే విధానం

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. కొన్ని స్వల్ప మార్పులతో ఈనెల 31న తుది నోటిఫికేషన్‌ కూడా వెలువడనున్నది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు కసరత్తు కూడా దాదాపుగా పూర్తిచేశారు. మార్పుల్లో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతలు మేరకు రాష్ట్రంలో కొత్తగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభంలో 11 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ 11కు తోడు మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవబోతున్నాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో స్వల్ప మార్పులు కూడా చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట జిల్లా నుండి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాల పాలనను ప్రారంభించనున్నారు. ఆదిశగా ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడ ఉగాది రోజున వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్‌ కొత్త జిల్లాల పాలనకు పచ్చజెండా ఊపనున్నారు. ఇదిలా ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ కొంత కాలంపాటు పాత జిల్లాల విధానంలోనే పాలన కానసాగించాలని నిర్ణయించారు. అలాగే, జిల్లా పరిషత్‌ ఛైర్మన్ల పాలన కూడా కొన్ని రోజులపాటు ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో తెలంగాణలో అవలంభించిన విధివిధానాలను ఇక్కడ కూడా అవలంభించి వ్యవస్థ గాడిన పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అదనంగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు..

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంటు వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో 11 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే, ఈప్రక్రియ ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన వినతుల మేరకు అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే, 10 మండలాలను ఈ ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నివేదికలు కూడా తయారుచేసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అందజేయనున్నారు. దీనిపై ఆయన పరిశీలించిన అనంతరం వాటి ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలో చాలా వరకూ సమస్య పరిష్కారం కానుంది. ఆదిశగానే అధికారులు కూడా కొత్త డివిజన్ల ఏర్పాటువైపు మొగ్గు చూపారు.

స్వల్ప మార్పులతో…

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయా ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 9 వేల వినతులను అధికారులు పరిశీలించారు. వాటిలో 400 వినతులు ముఖ్యమైనవిగా గుర్తించారు. అందులోనూ 70 రకాల వినతులు తప్పనిసరిగా పరిశీలించేవని గుర్తించారు. ఆదిశగా వాటిని పరిశీలించి కొత్త జిల్లాల పరిధిలో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి మార్పుల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించారు. ఒకటి రెండు రోజుల్లో వాటిని పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. అయితే, ప్రజల నుండి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించినప్పటికీ వాటిలో ఇబ్బందికరమైన వినతులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుని ఆమోదం తెలిపారు. ఫలితంగానే స్వల్ప మార్పులతో కొత్త జిల్లాల ప్రకటన చేయబోతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement