Saturday, September 7, 2024

ముగుస్తున్న మద్యం షాపుల గడువు.. ఈ నెల 30 ఆఖరు

అమరావతి, ఆంధ్రప్రభ: : మరికొద్ది రోజుల్లో మద్యం షాపుల లైసెన్స్‌ గడువు ముగుస్తుంది. కొత్తగా మద్యం షాపుల లైసెన్స్‌లను రెన్యువల్‌ చేస్తారా? మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? అనే దానిపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు చెప్పేదేమీ లేదంటూ అధికారులు దాటవేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి గతేడాది కొద్దిపాటి మార్పులతో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2, 934 మద్యం షాపుల లైసెన్స్‌లను రెన్యువల్‌ చేయడంతో పాటు అమ్మకాల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌, డిజిటల్‌ పేమెంట్లకు అనుమతి, వాక్‌ఇన్‌ ఎలైట్‌ స్టోర్ల ఏర్పాటు, ఆబ్కారీ శాఖ అధికారుల అనుమతులతో పర్యాటక ప్రాంతాల్లో మద్యం రిటైల్‌ ఔట్లకు అనుమతిస్తూ గతేడాది లైసెన్స్‌లు రెన్యువల్‌ చేశారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం ఈసారి ఆచితూచి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. వచ్చే వారంలో శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత మద్యం షాపుల లైసెన్సుల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావొచ్చు.

కొత్త మద్యం పాలసీ..

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ 2019 అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. గతంలో మద్యం షాపులు ప్రైవేటు నిర్వహణలో ఉండేవి. కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వ నిర్వహణలోకి మద్యం షాపులను తీసుకొచ్చారు. షాపుల నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌(ఏపీబీసీఎల్‌)కు అప్పగించారు. గతంలో షాపులకు, బార్లకు మద్యం సరఫరా మాత్రమే చేసిన ఏపీబీసీఎల్‌ కొత్త పాలసీలో భాగంగా రిటైల్‌ షాపుల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.

- Advertisement -

కొత్త విధానంలో భాగంగా ప్రైవేటు నిర్వహణలోని 3,483 మద్యం షాపులను 2,934 కుదించారు. ఏటా అక్టోబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పలు మార్పులు చేర్పులతో షాపుల లైసెన్స్‌లను పునరుద్ధరిస్తున్నారు. తొలి రెండేళ్లలో షాపుల సంఖ్యను గణనీయంగా కుదించారు. గత ఏడాది షాపుల గడువు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల్లో వాక్‌ ఎలైట్‌ స్టోర్లు, పర్యాటక శాఖ కోసం మద్యం షాపుల ఏర్పాటుకు వెసులుబాటు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త పాలసీలో పలు కీలక మార్పులు..

కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం అనేక కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు పర్మిట్‌ రూమ్‌ విధానాన్ని రద్దు చేసింది. గతంలో మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్‌ షాపుల వ్యవస్థ ఉండేది. రూ.లక్ష అదనంగా చెల్లించి పర్మిట్‌ రూమ్‌కు అనుమతి తీసుకుంటే..షాపుల వద్దనే మద్యం తాగే వెసులుబాటు ఉండేది. ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. మరో వైపు మద్యం షాపుల అమ్మకపు వేళలను కూడా ప్రభుత్వం కుదించింది. గతంలో ఉదయం 11గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం షాపుల్లో అమ్మకాలు జరిగేవి.

దీని వలన మద్యం వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావించి వేళలను కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకే మద్యం అమ్మకాలు నిర్వహించేలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. నగదు, సరుకు లావాదేవీలు లెక్కించుకునేందుకు అదనంగా ఒక గంటపాటు వెసులుబాటు కలిపించింది. ఇదే సమయంలో మద్యం రేట్లను భారీగా పెంచడం ద్వారా వినియోగం కట్టడికి ప్రభుత్వపరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంది.

మార్పులు ఉంటాయా?

వచ్చే ఏడాది ఎన్నికల నేపధ్యంలో ఈసారి మద్యం షాపుల లైసెన్స్‌ గడువు పొడింపులో కొన్ని కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవి ఏ తరహా మార్పులనేవి మాత్రం అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత లేదు. అసెంబ్లిd సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా చర్యలు ఉండొచ్చనేది పలువురి అభిప్రాయం. సామాజిక మాధ్యమాల్లో ప్రైవేటు నిర్వహణలోకి మద్యం షాపులు తీసుకొస్తారనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని మార్పులు మాత్రం ఉండొచ్చని మాత్రం చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement