Tuesday, May 7, 2024

Delhi: ఆ కార్ స్టిక్కర్ నకిలీది, నా పేరు వాడుకుని బెదిరింపులు.. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కేశినేని ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కార్ స్టిక్కర్ దుర్వినియోగంపై విజయవాడ ఎంపీ (తెలుగుదేశం) కేశినేని శ్రీనివాస్ (నాని) లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. నిజానికి మే నెలలోనే చేసిన ఫిర్యాదు ప్రతిని ఆయన బుధవారం మీడియాకు విడుదల చేశారు. ఓ వ్యక్తి తన పేరు వాడుకోవడమేగాక, మోసపూరితంగా తన పేరుతో నకిలీ స్టిక్కర్లు అతికించిన వాహనాన్ని వినియోగిస్తున్నాడంటూ అందులో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులకు ఇచ్చే కార్ స్టిక్కర్‌ను ఫోర్జరీ చేసి, నకిలీది సృష్టించి TS 07 HW 7777 నెంబర్ గల వాహనంపై అతికించుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడని ఫిర్యాదులో వివరించారు. ఇలా తన పేరును, కార్ స్టిక్కర్‌ను దుర్వినియోగం చేస్తున్న విషయం తెలిసి దిగ్భ్రాంతి చెందానని అన్నారు.

అలాగే తన పేరు వాడుకుని వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్టు కూడా తన దృష్టికి వచ్చిందని కేశినేని నాని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ అంశంపై హైదరాబాద్, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 416, 415, 468, 499 రెడ్ విత్ 34 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై కేశినేని నాని వివరణ కోరగా, తాను చెప్పాల్సింది ఫిర్యాదులోనే చెప్పానని బదులిచ్చారు. తన పేరును ఈ రకంగా దుర్వినియోగం చేస్తుంటే ఫిర్యాదు చేయకుండా ఎలా ఉంటానని, లేనిపక్షంలో ఆ తప్పులను తాను సమర్థించినట్టు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ తన పిల్లలే ఈ పని చేసినా ఫిర్యాదు చేసి ఉండేవాడినని ఆయనన్నారు.

నిజానికి పార్లమెంట్ స్టిక్కర్ ఉన్న ఏ వాహనం కూడా తాను హైదరాబాద్, విజయవాడ నగరాల్లో వినియోగించడం లేదని, అక్కడి వాహనాల నెంబర్ ప్లేట్లపై ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్’ అని మాత్రమే రాసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన పిల్లలు కనీసం ఆ వాహనాల్లో కూడా ప్రయాణించరని కేశినేని నాని వివరించారు. కొన్నాళ్లుగా టోల్ గేట్ల నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని, తరచుగా తన పేరుతో పార్లమెంట్ స్టిక్కర్ కలిగిన వాహనాలు టోల్ ప్లాజా దాటుతున్నాయని తన దృష్టికి తీసుకురావడంతోనే ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను ఉపయోగించే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా నకిలీ స్టిక్కర్ అతికించుకుని తిరుగుతుండడంతోనే ఫిర్యాదు చేశానని, పఠాన్‌కోట్ వంటి ఘటనలో ఉగ్రవాదులు ఇదే తరహాలో నకిలీ స్టిక్కర్ల దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement