Friday, April 26, 2024

ఏపీలో అనాథలుగా 93 మంది చిన్నారులు.. రూ.10 లక్షలు ఫిక్సడ్ డిపాజిట్

రాష్ట్రంలో వివిధ ప్ర్రైవేటు ఆసుపత్రుల్లో 61.13 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో 79.59 శాతం ఆరోగ్య శ్రీ పథకం వైద్య సేవలు అందుకున్నారన్నారు. నిర్ధేశించిన లక్ష్యం కంటే అధిక శాతం మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు అందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,674 ఐసీయూ బెడ్లు, 7,527 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 14,658 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆక్సిజన్ వినియోగం రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 24 వేల నుంచి 11 వేలకు తగ్గాయన్నారు. నాలుగు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని, తగ్గడం లేదంటూ కొందరు అవస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అవాస్తవాల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదముందన్నారు. గత వారం రోజులుగా అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 91 శాతానికి పెరిగిందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో 99.2 వరకూ పెరగనుందన్నారు.

రాష్ట్రంలో 1,187 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. 11,605 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు. పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కొనుగోలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 89 ఆసుపత్రులపై విజిలెన్స్ కేసులు నమోదు చేయగా, 66 కేసుల్లో రూ.9.90 కోట్ల వరకూ వసూలు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన 93 మంది చిన్నారులను గుర్తించామన్నారు. వారి పేరున ఫిక్సడ్ డిపాజిట్ చేసిన రూ.10 లక్షలకు నెలకు రూ.5 వేలు వడ్డీ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే జరుగుతున్న వ్యాక్సినేషన్ తో కలిపి జూన్ నెలాఖరు వరకూ 1.60 కోట్ల టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందన్నారు. కేంద్రమిచ్చే వ్యాక్సిన్ కోటా చాలకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement