Saturday, May 4, 2024

Temples Rush – కొత్త సంవ‌త్స‌రం.. ఆల‌యాల‌లో పోటెత్తిన భ‌క్త జ‌నం..

నూతన సంవత్సరం సందర్భంగా ఎపి,తెలంగాణ‌ ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచీ తరలివచ్చారు. స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు. కాగా తిరుమ‌ల‌లో శ్రీవారి ద‌ర్శ‌నానికి 14 గంట‌ల స‌మ‌యం తీసుకుంటున్న‌ది..

రాజ‌న్న ఆల‌యం …

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కొత్త ఏడాది తొలి రోజు కావడం, మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి ఆల‌యం ..

ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

- Advertisement -

యాదాద్రిలో

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది.

చిలుకూరులో పోటెత్తిన భ‌క్త జ‌నం

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిలుకూరు బాలాజీ దేవాలయంలో నేడు మహాద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనం క‌ల్పించారు దీంతో భ‌క్తులు పోటేత్తారు…భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 ప్రదక్షిణలు నిలిపివేయడంతోపాటు మహాద్వారం (లఘుదర్శనం) నుంచే దర్శనాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు… నాలుగు క్యూల ద్వారా భక్తులను అనుమతించనుండగా, ఆలయానికి కిలోమీటరు దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి రావాల్సి ఉంటుంది.

కాగా, కొత్త ఏడాది వేళ నేడు దాదాపు లక్షన్నరమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ట్రిప్పులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement