Sunday, April 28, 2024

వాటర్ వార్: గొడవంతా కృష్ణా జలాలపైనే!

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ ముదురుతోంది. జల వివాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అగ్గిపుట్టిస్తోంది. ఇరు రాష్ట్రాలకు చెందిన నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. కృష్ణా బేసిన్‌లో వివాదం నెలకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులతో రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్లు అగ్గి రాజేశాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య ఘర్షణ మళ్లీ మొదటికొచ్చాయి. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంతో పాటు ఆర్డీఎస్‌ విస్తరణను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుకులు కడుతోందంటూ ఆయన చేసిన కామెంట్స్ కాక పట్టించింది. దీనిపై ఏపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.

కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం దూకుడుగానే వ్యవహరిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపై ఎన్‌జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఏపీ చర్యలతో కరువుకు తోడు ఫ్లోరైడ్‌ ప్రాంతాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా మళ్లీ ఆదేశాలు జారీ చేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో తాజాగా మరో దరఖాస్తు దాఖలైంది. ఎన్జీటీ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సహా బాధ్యులైన అధికారులందరిపైనా చర్య తీసుకోవడంతోపాటు, పర్యావరణ అనుమతి లేకుండా పనులు చేస్తుండటంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తగు ఆదేశాలు చేయాలని తాజాగా కోరారు. గతంలో ఎన్జీటీని ఆశ్రయించిన జి.శ్రీనివాస్‌ మళ్లీ దరఖాస్తు దాఖలు చేయగా, తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా శుక్రవారం ఎన్జీటీకి వెళ్లనున్నట్లు తెలిసింది.

కృష్ణా నదీ జలాలపై వివాదం చాలాకాలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనుగడలో ఉండగా ఇది మూడు రాష్ట్రాల సమస్యగా ఉండేది. ప్రస్తుతం అది మహారాష్ట్ర, కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదంగా మారింది. తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్ల చుట్టూ. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన అంశాల్లో నీళ్లే ప్రధాన ఎజెండా. పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీళ్లకే పెద్దపీట వేసింది. గోదావరిపై ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. కొటి ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, కృష్ణాకు సంబంధించి నీటి యుద్దం మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ లపై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం లేదని గ్రీన్‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తీవ్రంగా స్పందించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులేం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రశ్నించారు. బేసిన్లు లేవు.. బేషజాలు లేవన్న సీఎం కేసీఆర్‌.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఇప్పుడేమంటారని ఎదురు దాడికి దిగారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు.

తెలంగాణ మంత్రి వేముల వ్యాఖ్యలపై ఏపీ నేతలు సైతం ఘాటుగా స్పందించారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు అనుమతులెక్కడివని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పడాన్ని ఖండించారు. ఏపీ ప్రజలు రాక్షసులా, ఎవరిపై యుద్ధం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -

మరోవైపు కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆవేశంతో, పరుషంగా మాట్లాడడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని హితవు పలికారు. తెలంగాణ నేతలు మాట్లాడే మాటలను వారి విచక్షణకే వదిలేస్తున్నామని తెలిపారు. మొత్తం మీద ఈ జల జగడం తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త యుద్ధం సృష్టించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకునే పరిస్థితి లేదు!

Advertisement

తాజా వార్తలు

Advertisement