Sunday, April 28, 2024

తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకునే పరిస్థితి లేదు!

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు రాజకీయ విమర్శలకు దారితీస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఏపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల అంశంపైనా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొందరు తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఆవేశంతో, పరుషంగా మాట్లాడడం వల్ల ఏ సమస్యా పరిష్కారం కాదని హితవు పలికారు. తెలంగాణ నేతలు మాట్లాడే మాటలను వారి విచక్షణకే వదిలేస్తున్నామని తెలిపారు. తాము వారి కంటే ఎక్కువే మాట్లాడగలమని, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తెలంగాణ సీఎంతో కలిసి ప్రాజెక్టులపై చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. అలాగని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని సజ్జల తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement