Saturday, May 4, 2024

దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోందన్నారు. ఎక్క‌డ చూసినా దౌర్జ‌న్యాలు, దోపిడీలే కొన‌సాగుతున్నాయని తెలిపారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను నమ్మకున్నవాళ్లు ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారని.. పోలీసులకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, దౌర్జన్యాలను వడ్డీతో సహా చెల్లించేరోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ ఎప్పుడూ ముఠా రాజకీయాలకు దూరమని చంద్రబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించే విధంగా జనార్ధన్‌రెడ్డి ఎప్పుడూ పనిచేయలేదన్నారు. జనార్ధన్‌రెడ్డి ఇంటి దగ్గరకు కాటసాని రామిరెడ్డి అనుచరులు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. గొడవ చేసిన వారిపై కాకుండా బాధితులపై కేసులు పెట్టడమేంటని నిలదీశారు. అక్ర‌మ‌ కేసులు పెడితే వెంట‌నే న్యాయ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. చ‌ట్టం అంద‌రికీ స‌మానం అని, చ‌ట్టం ఎవ్వ‌రికీ చుట్టం కాదన్నారు. స్వార్థ‌పూరితంగా కొంద‌రు చ‌ట్టాన్ని వాడుకుంటే దానికి వ్య‌తిరేకంగా పోరాడ‌తామన్నారు. ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డొద్దని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జ‌గ‌న్ సర్కార్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌రోనా కార‌ణంగా రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement