Saturday, May 4, 2024

శ్రీవారి గరుడసేవ!.. తిరుమలలో ద్విచక్రవాహనాల రాకను రద్దు చేసిన టీటీడీ

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు (శనివారం) రాత్రికి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడిని అధిరోహించి భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపధ్యంలో టీటీడీ, జిల్లా, విజిలెన్స్‌, పోలీస్‌శాఖ వారు పటిష్ట భద్రతను, బందోబస్తును ఏర్పాటు చేశారు. గరుడసేవను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రివిలైడ్జ్‌ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా సామాన్యభక్తుల సౌకర్యార్ధం సర్వదర్శనం మాత్రమే కొనసాగుతోంది. రద్ధీని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యాలు, రవాణా, భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్టిసి విభాగం తిరుపతి, తిరుమల మద్య ఆర్టిసి బస్సులతో మొత్తం 3700 ట్రిప్పుల కు పైగా తిప్పనున్నారు. ప్రతి 10 సెకన్లకు ఒకబస్సు భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. తిరుమలకు చేరుకున్న భక్తులను నేడు ఉదయం 10 నుంచి గ్యాలరీలలోనికి భక్తులను అనుమతిస్తామని, ఆ తర్వాత గ్యాలరీలలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, త్రాగునీటిని ఇబ్బందిలేకుండా నిరంతరాయంగా అందిస్తామని టిటిడి తెలిపింది. ఇప్పటికే అలిపిరి నుంచి తిరుమల వరకు రోడ్డు భద్రతకు పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటున్నారు.

అత్యవసర పరిస్థితులలో భక్తులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు ప్రథమచికిత్స అందచేసేందుకు మెడికల్‌ కేంద్రాలను, అంబులెన్సులను సిద్ధం చేశారు. టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేస్తూ వాహనం తిరిగేటపుడు నాణేలను విసరవద్దని, దీని వలన ఉత్సవమూర్తులకు నష్టం వాటిల్లుతుందని, కానుకలు ఇవ్వదలచినవారు వాహనల సేవకు ముందుభాగాన నడిచే మొబైల్‌ హుండీలలో వేయాలని టిటిడి వారు కోరారు. భక్తులకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నాలుగు మాడవీధులలో భారికేడ్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వివిఐపి, విఐపి, పోలీస్‌, ప్రెస్‌, టిటిడి సిబ్బందికి ప్రత్యేకంగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులను ఆసరాగా తీసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక టీమ్‌లను పోలీస్‌శాఖ సిద్ధం చేసింది.

అంతే కాకుండా తిరుమలలో ప్రధానకూడళ్ళు, మాడవీధులు, పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సిసి కెమరాల ద్వారా అనునిత్యం పరిశీలిస్తూ ఏవరైనా అనుమానితులు తిరుగుతుంటే గుర్తించి వివరాలు సేకరించడానికి సెంట్రల్‌ కమాడెంట్‌ కంట్రోల్‌రూమును ఏర్పాటు చేసి నిరంతరాయంగా గస్థీ కాస్తున్నారు. నేడు గరుడసేవ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ద్విచక్ర వాహనాలను తిరుమలకు పూర్తిగా నిషేదించారు. తిరుపతి, శ్రీవారి మెట్టు మార్గంలో ద్విచక్ర వాహనాలకోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామని కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి వాహనాలను కొండక్రిందనే విడిచి తిరుమలకు చేరుకోవాలని టిటిడి, పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

గరుడసేవ రోజున తిరుమలకు వాహనాలలో వచ్చే యాత్రికులను నియంత్రించడానికి టిటిడి అధికారులు పోలీస్‌ విభాగాల సమన్వయంతో ప్రణాళికను సిద్ధం చేశారు. తిరుమలలోకి ప్రవేశించగానే ఎక్కడికక్కడ అందుబాటులోని ప్రదేశాలలో వాహనాలను నిలపడానికి ఏర్పాట్లు చేశారు. ఆ పరిస్థితిని ఈ పాటికే పోలీస్‌, విజిలెన్సు విభాగాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. మరో వైపు గరుడసేవను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ బందోబస్తును రెట్టింపు చేశారు. గరుడసేవరోజున 4500 మందే కాకుండా మరో 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరో వైపు పోలీస్‌, టిటిడి విజిలెన్సు, సెక్యూరిటి విభాగ అధికారులు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగుమాడవీధులను పూర్తిగా టీటీడీ, విజిలెన్స్‌, పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. మాడవీధులలో ఉన్న అన్ని మార్గాలను మూసివేసి, కొన్ని ప్రాంతాల లో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి గరుడసేవకు వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీచేశాక కాని మాడవీధులలోని వాహనసేవల గ్యాలరీలలోకి అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement