Thursday, April 25, 2024

ఆదిత్యుని దర్శించుకున్న అమరావతి రాజధాని రైతులు

శ్రీకాకుళం : అమరావతే ఏకైక రాజధాని అంటూ పోరాటం చేస్తున్న రాజధాని రైతులు ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు నిరసన దీక్షలు 1200 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా గత సంవత్సరం రెండు విడతలుగా పాదయాత్రలు కూడా చేపట్టారు. రెండవ విడతలో అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర దాదాపు 40 రోజుల తరువాత కోర్టు వివాదాల కారణంగా కోనసీమ జిల్లాలో యాత్ర నిలిచిపోయింది. యాత్రలో వచ్చిన రథం కూడా అక్కడే ఉండిపోయింది. గత సంవత్సరం యాత్రకు చెందిన నాయకులు శ్రీకాకుళం వచ్చి పట్టణంలో పాదయాత్ర నిర్వహించి అరసవల్లి చేరుకొని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఆ యాత్రలో పాల్గొన్న దాదాపు 200 మంది మహిళలతో సహా రైతులు బస్సులు, కార్లలో ఆదివారం అరసవిల్లి వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. శనివారం సాయంత్రానికే పాదయాత్రలో నడిపిన రథం కూడా అరసవిల్లి చేరుకుంది. రైతులకు స్థానిక టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ, యాత్ర నిలిచిపోయిన కారణంగా మొక్కులు తీర్చుకున్నామని, అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటన వచ్చిన తరువాత మళ్లీ తాము అరసవిల్లి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement