Saturday, May 4, 2024

డిగ్రీ క‌ళాశాల‌ల్లో సీట్లు.. హైకోర్టు అనుమ‌తి..

అమరావతి, (ప్రభ న్యూస్‌): డిగ్రీ కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు హైకోర్టు పరిమితులతో కూడిన అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపు జరపవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌, మరో 30 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం జీవో 55ను జారీ చేసింది. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్లకు అనుమతిస్తూ, మిగిలిన 30 శాతం యాజమాన్య కోటాను భర్తీ చేయవద్దని ఆదేశించింది. జీవో 55పై తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై గత కొద్దిరోజుల క్రితం రాయలసీమ డిగ్రీ కళాశాలల సంఘం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై గత నెలలో విచారణ జరిపిన ధర్మాసనం సీట్ల భర్తీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ రిట్‌పిటిషన్‌తో పాటు ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయ మూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మా సనం విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ ప్రవేశాల పేరిట డిగ్రీ కళాశాలలను తన అదుపు ఆజ్ఞల్లోకి తీసుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నట్లు అవగతమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. యాజమాన్య కోటా తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను ఆ కోటాకు వర్తింప చేయకపోవటమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. యాజమాన్య సీట్లను కూడా భర్తీచేసుకునే వెసులుబాటు కల్పించకపోతే వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తరుపు న్యాయ వాదులు కేవీ రఘువీర్‌, సురేష్‌, ఆనంద్‌ వాదించారు. యాజమాన్య సీట్ల భర్తీతో కన్వీనర్‌ కు సంబంధం లేదన్నారు. యాజమాన్య సీట్లను విద్యార్థులే ఎంపిక చేసుకు నే విధంగా వెసులుబాటు కల్పించడం వరకే కన్వీనర్‌ బాధ్యత అని వివరించారు. జీవో 55తో విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. ఇప్పటికే 2.13 లక్షల మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం 70 శాతం కన్వీనర్‌ కోటా భర్తీకి అనుమతివ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. యాజమాన్య కోటా 30 శాతం భర్తీని తదుపరి ఆదేశాలిచ్చే వరకు భర్తీచేయరాదని ఆదేశించింది. జీవో 55పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement