Tuesday, April 30, 2024

Schools Mafia – యాప్ ల పేరుతో వీర‌బాదుడు – కార్పొరేట్ స్కూళ్ల న‌యా దోపిడి…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఒకటవ తరగతి ఫీజు అక్షరాల రూ.25 వేలు, నోట్‌ బుక్స్‌ల ఖరీదు రూ.7 వేలు పైమాటే.. 2వ తరగతి ఫీజు రూ.28 వేలు, నోట్‌ బుక్స్‌ ఖరీదు రూ.8,200 లు, 3వ తరగతి ఫీజు రూ.30 వేలు, నోట్‌ బుక్స్‌ ఖరీదు రూ.10 వేలు, ఇవి కాకుండా యూనిఫాం, టై, బెల్టు, షూస్‌ పేరుతో మరో రూ.5 వేలు పైగా వసూళ్లు..ఇదంతా అమెరికా లోని కార్పొరేట్‌ స్కూల్‌ ఫీజులు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అక్షరాల ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ జిల్లాల్లో కార్పొరేట్‌ స్కూళ్ల దందా ఇది. మరికొన్ని కార్పొరేట్‌ స్కూళ్లలో అయితే పై ఫీజుల కంటే మరింత అదనంగా కూడా బాదేస్తున్నారు. అయితే ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ పెద్దగా కొత్తేమి కానప్పటికీ ప్రస్తుత ఏడాది మాత్రం కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు తమ దందా స్టైల్‌ను మార్చే శారు.

అభివృద్ధి చెందుతున్న సాంకే తిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని యాప్‌ల ముసుగులో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. అయితే యాప్‌ ల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ తమ బండారం బయట పడ కుండా ఉండేందుకు గుట్టుచప్పుడు కాకుండా నోట్‌ బుక్స్‌ బిల్లులోనే అదనపు బాదుడు బాదేస్తున్నారు. ఆ బిల్లులో నుంచి తరగతిని బట్టి రూ.2 వేలు నుంచి రూ.3 వేలు దోచేస్తున్నారు. అందుకు బిల్లులు కూడా ఇవ్వకపోగా నోట్‌ బుక్స్‌ బిల్లులో కూడా తగ్గించి చూపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నోట్‌ బుక్స్‌ అమ్మకాల్లోనూ పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఓవైపు ఫీజుల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ ఆ దిశగా ఆయా పాఠశాలల్లో ఫీజులను నియంత్రించింది. అందుకోసం విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో మాత్రం విద్యాశాఖ అధికారులు కార్పొరేట్‌కు దాసోహం అవుతున్నారే తప్ప విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకు తింటున్న కార్పొరేట్‌ యాజమాన్యంపై మాత్రం చర్యలు తీసుకోలేకపోతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్‌ దందా మరింత జోరుగా సాగుతోంది.

బడులు తెరిచారు..దందా మొదలెట్టారు..!
పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయో..లేదో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీ మొదలైంది. ఆయా జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి ఒకే తరహా దందాకు శ్రీకారం చుడుతున్నాయి. ఎల్‌కేజీ మొదలు 10వ తరగతి వరకు స్కూల్‌ స్థాయిని బట్టి ఫీజులను వారికై వారే నిర్ణయించుకుని ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి మూడు రకాల ఫీజులను నిర్ణయించింది. అంతకు మించి అదనంగా వసూలు చేసినట్లు తెలిస్తే ఓ స్కూల్‌ అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించింది. అయినా రాష్ట్రంలోని నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్‌ స్కూళ్లతో పాటు ఆయా జిల్లాల్లోని మరికొన్ని ప్రైవేటు స్కూళ్లలో భారీగా ఫీజులను పెంచేసి దోచుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా స్కూళ్లలో 10 నుంచి 15 శాతం ఫీజులను పెంచేశారు. అవి చాలవన్నట్లుగా నోటు పుస్తకాల ధరలను రెండింతలు పెంచి యాప్‌ల పేరుతో ఆ బిల్లులో రూ.2 వేలు నుంచి రూ.3 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే సర్కార్‌ బడుల్లో ట్యాబ్‌ల ద్వారా యాప్‌లపై విద్యార్థులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని, అదే తరహాలో అంతకు మించి మరింత నాణ్యమైన యాప్‌ల ద్వారా మీ పిల్లలకు అవగాహన కల్పించేలా తరగతులు నిర్వహించబోతున్నామని మాయ మాటలు చెబుతూ నోటు పుస్తకాల బిల్లులో అదనంగా కాజేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న అక్రమ ఫీజులపై ఉక్కుపాదం మోపుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేసిన ప్రతిసారి ప్రైవేటు ఫీజుల నియంత్రణపై ప్రత్యేకంగా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశంలోనూ ఇదే అంశంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎక్కడైనా అదనంగా ఫీజు వసూలు చేసినట్లు తెలిసినా నోటు పుస్తకాలు, యూనిఫాం పేరుతో అదనంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చినా తక్షణమే సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే పాఠశాల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేయాలని సూచించారు. అయితే జిల్లాల్లో మాత్రం విద్యాశాఖ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారు. బడులు తెరిచి మూడ్రోజులు కావస్తున్నా ఎక్కడా కూడా ప్రైవేటు పాఠశాలల్లో అక్రమంగా వసూలు చేస్తున్న ఫీజులపై దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. పాఠశాలలు పున: ప్రారంభం రోజు పెద్దఎత్తున ప్రచార ప్రకటనలు చేపట్టినా అటువంటి పాఠశాలలపై కనీసం నోటీసులిచ్చిన దాఖలాలు కూడా లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని కొంతమంది విద్యాశాఖ అధికారులు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యంతో చేతులు కలిపి వారిచ్చే మామూళ్లతో కార్యాలయాలకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement