Monday, April 29, 2024

ఆనందయ్య కరోనా మందు: క్రిటికల్ గా రిటైర్డ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం

ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ రోజు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. కోటయ్యకి ఆక్సిజన్ లెవల్స్ మళ్ళీ 77 కి పడిపోవడంతో  ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యలు చికిత్స అందిస్తున్నారు.  ఆనందయ్య ఇచ్చిన పసరు మందు తీసుకున్న మాస్టారు కోటయ్యకు కంటి సమస్య తలెత్తింది. పసరు వేయడం వల్ల కంటి నల్ల గుడ్డు పైపొర దెబ్బ తింటుందని.. జిల్లేడు పాల వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని కంటి వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్‌ పడింది. కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుర్వేద మందుపై ఐసీఎంఆర్‌ బృందం నివేదికను సిద్దం చేయనుంది.

 కృష్ణపట్నం కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా నుంచే కాక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల తాకిడి ఎక్కువ అవ్వడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.

ఇది కూడా చదవండి: ఆనందయ్య కోసం జో బిడెన్ రాక.. కిడ్నాప్ కాకుండా చూడండి: ఆర్జీవీ

Advertisement

తాజా వార్తలు

Advertisement