Thursday, May 16, 2024

ఆనందయ్య కోసం జో బిడెన్ రాక.. కిడ్నాప్ కాకుండా చూడండి: ఆర్జీవీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ఆయుర్వేదం మందు పంపిణీ చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య గురించి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్యపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ‘‘ఎయిర్ ఫోర్స్ వన్‌ లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘‘పైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్ములాను ఎవరికీ షేర్ చేయలేదు. అలాంటిది, ఆనందయ్య మాత్రం ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.’’  అంటూ మరో ట్వీట్ చేశారు.

ఏపీలోని కృష్ణపట్నం కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా నుంచే కాక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ మందుపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో ప్రజలు కూడా తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. ఐసీయూలో ఉండే పేషెంట్లు కూడా ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకుని అక్కడికి వస్తున్నారు. ఆనందయ్య ఇచ్చిన ఆయుర్వేదం మందు వేసుకోగానే పూర్తిగా తగ్గిపోయిందని చెబుతున్నారు.

దీంతో ఈ ఆయుర్వేద మందుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఆనందయ్యకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా, పలువురు ఈ నాటు మందుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా నిర్ధారణ కాకుండా మందును ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బొనిగి ఆనందయ్య తయారు చేసిన మందుని ఆయుష్, ఐసీఎంసీ బృందం పరిశీలించింది. దీనికి సంబంధించిన నివేదికను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement