Friday, May 3, 2024

ఆయిల్‌ సరఫరాలో నియంత్రణ.. డీజిల్‌, పెట్ర‌ల్ స‌ప్ల‌య్‌పై ఆంక్ష‌లు.. ఏపీ వ్యాప్తంగా అమ‌లుకు చ‌ర్య‌లు..

అమరావతి, ఆంధ్రప్రభ : పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు, అమ్మకాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో చమురు కంపెనీలు పెట్రోల్‌ బంకులకు రోజువారీ సరఫరాలో కోత విధిస్తున్నాయి. ఇది ఇటు వాహనదారులకు, అటు బంకుల యాజమాన్యాలకు ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. రోజువారీ వ్యాపారంపై ప్రభావం పడుతుందని బంకుల యామజాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడిప్పుడే లభిస్తున్న కిరాయిలు ఆయిల్‌ దొరక్కపోతే పోయే ప్రమాదం ఉందని, ఫలితంగా తమ రోజువారీ జీవనంపై ప్రభావం పడే అవకాశం ఉందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ వరుసగా పెరిగిన చమరు ధరల మూలంగా బంకుల ఆదాయం కోల్పోయామని, మళ్లి ఇప్పుడు ఈ నిర్ణయంతో మరోమారు ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని బంకుల నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశాఖ నగరంలోని పెట్రోల్‌ బంకుల్లో రోజువారీ వినియోగంలో సగానికి సగం మేర మాత్రమే చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రధాన చమురు కంపెనీలు రోజువారీ సరఫరాలో కోత విధించనున్నాయి. ఆమేరకు చర్యలు ప్రారంభించాయి.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌ బంక్‌లకు పెట్రోల్‌ మరియు డీజిల్‌ సరఫరాపై ఆంక్షలు విధించాయి. సాధారణ సమయాల్లో, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమి-టె-డ్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీ లిమి-టె-డ్‌ (హెచ్‌పీసీఎల్‌) వంటి చమురు కంపెనీలు రోజుకు దాదాపు ఏడు లక్షల లీటర్ల డీజిల్‌ మరియు నాలుగు లక్షల లీటర్ల పెట్రోలును సరఫరా చేస్తుంటాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న 3,500 పెట్రోల్‌ బంకులకు ఈ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ను సరఫరా చేస్తాయి. భారత్‌ పెట్రోలియం గురువారం విశాఖపట్నంలో సరఫరాను తగ్గించడం ప్రారంభించింది, పరిమిత సంఖ్యలో బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ను అందించింది. ఇతర కంపెనీలు కూడా ఇదే తరహాలో కేటాయింపులను తగ్గించాయి. అంతేకాకుండా పెట్రోల్‌ బంక్‌ల్లోని భూగర్భ ట్యాంకులకు ఇంధనాన్ని లోడ్‌ చేసే సమయం అంతకుముందు ఉదయం 8 నుండి సాయంత్రం 6.30 వరకు ఉండగా, ప్రస్తుతం అది ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3.30 మధ్య పరిమితం చేశారు.

ధరల సవరణ అనంతరం లీటరు డీజిల్‌పై రూ. 25, పెట్రోల్‌పై రూ. 8 మేర కొనుగోలు, అమ్మకం ధరకు మధ్య వ్యత్యాసం వస్తోందని ఆయిల్‌ కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈకారణంగా తాము నష్టపోతున్నామని పేర్కొంటున్నాయి. అందువల్ల రోజువారీ డిమాండ్‌లో సగం డిమాండ్‌కు తగ్గట్టు-గా సరఫరాను తగ్గించేందుకు నిర్ణయించుకున్నామని చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం రోజువారీ డిమాండ్‌కు తగినంతమేర చమురు కంపెనీల వద్ద నిల్వలు ఉన్నప్పటికీ, నష్టాలను తగ్గించుకోవడానికి తక్కువ సరఫరా చేస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటు-న్నాయి. ఎపి ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌ మాత్రం భయాందోళనలకు గురికాకుండా ఇంధన సరఫరాలో కోత విధించకుండా చమురు కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఎలాంటి కొరత రాకుండా డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన సరఫరాను పర్యవేక్షించేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement