Friday, April 26, 2024

పెండింగ్ నిధులను విడుదల చేయండి, తెలుగు రాష్ట్రాల నిధుల విభజనపై చర్చ: కారుమూరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్-తెలంగాణ‌ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇవ్వవలసిన నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వెల్లడించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశానన్నారు. కేంద్ర మంత్రి సూచనల ప్రకారం రెండో రోజు తూనికలు, కొలతల విభాగ అధికారులను కలిసి రాష్ట్రానికి రావావల్సిన నిధులపై వినతిపత్రాలు సమర్పించామని కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు ఇవ్వడానికి కావలసిన పత్రాలను కేంద్ర పౌర సరఫరాల శాఖకు అందించామని వివరించారు. కేంద్రం నుంచి ఏపీకి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇవ్వాల్సిన నిధుల విడుదలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పుకొచ్చారు. పౌర సరఫరాల శాఖ కింద ఇవ్వాల్సిన నిధుల వాటాపై నీతి ఆయోగ్ రాష్ట్రానికి సానుకూలంగా నివేదిక ఇచ్చిందని, ఆ నివేదిక ఆర్ధిక శాఖకు వెళ్లిన తరువాత కేంద్రం నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నామని మంత్రి నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

దోషులను వదిలేదే లేదు
అనంతరం ఆయన టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించారు. పేపర్ లీక్ విషయంలో నారాయణను అరెస్ట్ చేశారని, ర్యాంకుల కోసం దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా వదలరని, తప్పు చేసిన వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. నారాయణ మంత్రిగా ఉన్నపుడు పేపర్ లీక్ జరిగిందో లేదో తనకు తెలీదన్నారు. ల్యాండ్ పూలింగ్ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుకి కూడా నోటీసులు ఇస్తారని నాగేశ్వరరావు చెప్పారు. చట్టం తమ పని తాను చేసుకుపోతోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement