Saturday, April 27, 2024

లక్ష మంది డ్రోన్‌ పైలెట్లు కావాలే.. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌

డ్రోన్‌ సర్వీసులకు దేశీయంగా నానాటికీ డిమాండ్‌ పెరిగిపోతున్నది. ఈ సర్వీసులను మరింత మెరుగుపరచడం కోసం కేంద్రంలోని 12 మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. రానున్న కొద్ది కాలంలోనే లక్ష మంది డ్రోన్‌ పైలట్లు అవసరమవుతారని ఆయన తెలియజేశారు. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నదని ఆయన తెలిపారు. నీతి అయోగ్‌కు చెందిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ త్రిముఖ వ్యూహంలోని… మొదటి అంశం… విధనాల రూపకల్పన. డ్రోన్‌ రంగానికి సంబంధించి కేంద్రం స్పష్టమైన విధానం అనుసరిస్తున్నదని, ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.

ఇక రెండవ అంశం.. ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సహాకాలు (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్స్‌- పీఎల్‌ఐ). డ్రోన్ల్‌ తయారీ, సేవల రంగంలో ఈ స్కీమ్‌ మంచి ఫలితాలు ఇస్తున్నది. 2021లోనే పీఎల్‌ఐ స్కీమ్‌ను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఇక మూడవ అంశం… దేశీయంగా డిమాండ్‌ను సృష్టించడం. ఈ పనిలోనే 12 మంత్రిత్వ శాఖలు తలమునకలై ఉన్నాయని చెప్పారు. ఇంటర్‌ పాసైన అభ్యర్థులకు రెండు మూడు నెలల శిక్షణ ఇవ్వడం ద్వారా డ్రోన్‌ పైలెట్లను తయారు చేస్తామని, వీరికి కనీసం నెలకు 30 వేల రూపాయల వేతనం లభిస్తుందని సింధియా తెలియజేశారు. ఇప్పటికే మొదటి బ్యాచ్‌ ప్రారంభమైందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement