Thursday, May 9, 2024

AP : అంబులెన్సు లో ఎర్ర స్మగ్లింగ్.. 10మంది స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : అంబులెన్సులో రోగులను తీసుకెళ్తున్నట్టు నమ్మిస్తూ ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న అడవిదొంగల ముఠా గుట్టును స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ సిబ్బంది రట్టు చేసారు. ఈ ఉదంతం పూర్వపరాలు ఇలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం మేరకు తిరుపతి కేంద్రంగా పనిచేసే టాస్క్ ఫోర్స్ కడప సబ్ కంట్రోల్ నుంచి ఆర్ఐ చిరంజీవి టీమ్ లోని ఆర్ఎస్ఐ రాఘవేంద్ర బృందం బాలపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే కోడూరు రేంజిలోని బాలపల్లి ఈస్ట్ రేంజి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద అనుమానాస్పదంగా కనిపించాడు. అతడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో, అతన్ని వెంట తీసుకుని ముందుకు వెళితే. అక్కడ ఒక అంబులెన్సు కనిపించింది. అంబులెన్సులో కొందరు ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్నారు. దీంతో వారిని చుట్టుముట్టగా ఏడుగురు పట్టుబడ్డారు. మరో నలుగురు పారిపోయారు. వారిని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన ఏలగిరి అనే మేస్త్రీ ద్వారా కూలీలను సమకూర్చుకుని బెంగుళూరుకు, అక్కడ నుంచి ప్రసాద్ అనే వ్యక్తి తమిళ కూలీలను తీసుకుని అనంతపురం, గుత్తి మీదుగా తిరుపతి చేరుకుని, అక్కడ నుంచి బాలపల్లి అటవీ ప్రాంతానికి పంపించారని తేలింది.

బాలపల్లిలో దుంగలు తీసుకుని అంబులెన్సులోకి ఎక్కించాక లక్ష్మీనరసయ్య అనే వ్యక్తి అంబులెన్సుకు డ్రైవరు గాను, ప్రసాద్, మహేష్ అనే వ్యక్తులు రోగులుగా నటిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటారని వెల్లడి అయింది. ఈ కేసులో అరెస్టు అయిన 10 మందిలో కడపకు చెందిన నిమ్మల ప్రసాద్ (49), లక్ష్మీ నరసయ్య (47), పొద్దుటూరు జి.సతీష్ కుమార్ (37), తమిళనాడు తిరువన్నామలైకు చెందిన మరిదిరి (61), గోవిందన్ (45), కాళి (49), జీ.సేతు (35), కాశి (35), హరి (25), రాజు మాణిక్యం (40)లుగా గుర్తించారు. మరో నలుగురు కోసం గాలించడానికి ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డితో ప్రత్యేక టీమ్ నియమించారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేసి సీఐ జి.శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నామని టాస్క్ ఫోర్స్ డి ఎస్ పి మురళీధర్ ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు. సాధారణంగా అంబులెన్సు నడుపుతూ చెక్ పోస్ట్ ల వద్ద ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తూ రవాణా చేస్తుంటారని వివరించారు. పట్టుబడిన పది దుంగలు, వ్యాను కలిపి సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని, ఈ కేసులో కింగ్ పిన్ ల కోసం గాలిస్తున్నామని కూడా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement