Wednesday, May 1, 2024

ఏప్రిల్‌ 1 నుండి పెరగనున్న స్థిరాస్థి విలువలు..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో భూములు, స్థలాల కొత్త విలువలు ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే జిల్లా స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. సవరణకు సంబంధించి వేగంగా ముందుకు వెళ్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి ఈ ధరలు పెరగనున్నాయి. 2020లో పెంచిన విలువ అమలులో ఉంది. కొత్త జిల్లాల ప్రకటనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. విలువలు పెంచితే ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, జిల్లా స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.524.5కోట్లు ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటివరకు దాదాపు రూ.410 కోట్లు సమకూర్చారు. నగర, పట్టణ ప్రాంతాల శివారులలో వ్యవసాయ పొలాలన్నీ స్థిరాస్థులుగా మారుతున్నాయి. కర్నూలు నుండి నంద్యాల, నందికొట్కూరు, కోడుమూరు, వెల్దుర్తి వరకు ఇళ్ల స్థలాల వెంచర్లు వెలిశాయి. బనగానపల్లె, ఆత్మకూరు, ఎమ్మిగనూరు, డోన్‌, ఆళ్లగడ్డ, బేతంచెర్ల పట్టణాలు స్థిరాస్థి వ్యాపారంతో విస్తరిస్తున్నాయి.

కర్నూలు సమీపంలోని 5 గ్రామాలు నగరపాలక సంస్థ పరిధిలోకి రావడంతోఆయా గ్రామాలలోని భూముల విలువలు పెరిగాయి. బి తాండ్రపాడు, పసుపల, దిన్నెదేవరపాడులో ఎకరా రూ.13లక్షలు పలుకుతున్నది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఎకరా పొలం విలువ రూ.కోట్లలోనే నడుస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం కర్నూలు పరిధిలో గజం విలువ కనిష్టం రూ.10వేలు కాగా, గరిష్టం రూ.45వేలు, నంద్యాలలో రూ.1500, గరిష్టం రూ.21వేలు, ఆదోని పరిధిలోని గరిష్టం రూ.17వేలు, ఎమ్మిగనూరు పరిధిలో గరిష్టం రూ.14,300 వరకు ఉంది.

25న కొత్త ధరలు ఖరారు..

ఏప్రిల్‌ 1 నుండి అమలులోకి వచ్చే ధరలపై రెవెన్యూ జేసి రామ్‌సుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు రేంజ్‌ డిఐజి కిరణ్‌కుమార్‌, జిల్లా రిజిస్ట్రార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ నిబంధనల మేరకు ధరలు నిర్ణయించనున్నారు. ఇప్పటికే సవరణకు సంబందించిన ప్ర క్రియ పూర్తిచేశారు. ఈ ఏడాది కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి ధరలను నిర్ణయిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement