Sunday, May 5, 2024

ప్రచారంపై దుబారా కంటే, జీతాలు పెంచొచ్చుకదా : జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించే ముందు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల జీతాలు తగ్గించుకోవాలని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను చూస్తేనే ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నట్టు అర్థమవుతుందని విమర్శించారు. ఉద్యోగ సంఘాలు సైతం బీజేపీతో కలసి నడవాల్సిన అవసరముందని అన్నారు. బీజేపీ మాత్రమే వారికి న్యాయం జరిగేలా చేయగలదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఎలాగైతే న్యాయం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలా న్యాయం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రచారంపై పెట్టే దుబారా ఖర్చులు తగ్గించుకుని ఉద్యోగుల జీతాలు పెంచాలని సూచించారు. వందల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తూ సలహాదారులను పెట్టుకున్నారని, అంత మంది సలహాదారుల అవసరమేముందని జీవీఎల్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుకోడానికి లేని ఇబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచితేనే వస్తుందా అని ప్రశ్నించారు. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు మాత్రమే త్యాగం చేయాలా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎందుకు చేయరు?” అంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నలు సంధించారు.

విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE)కు 2016లోనే భూమి కేటాయించినప్పటికీ, ఆ భూమిని అప్పగించకుండా కాలయాపన జరిగిందని జీవీఎల్ అన్నారు. తాను చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన తర్వాతనే స్థలాన్ని సంస్థకు అప్పగించారని, త్వరలో అక్కడ భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే ఐఐఎం – విశాఖపట్నం కూడా త్వరలో నిర్మాణం పూర్తిచేసుకోబోతుందని అన్నారు.

కేసినోల సంగతేంటి? రాష్ట్రాన్ని థాయిల్యాండ్‌లా మార్చేస్తారా?
ఓవైపు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదంటూ, మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు పేకాట క్లబ్బులు, కేసినోల పేరుతో దోచుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. గోవా తరహాలో కేసినోలు అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తర్వాత దశలో ధాయిల్యాండ్ తరహాలో మసాజులు, ఇతర జుగుప్సాకర కార్యకలాపాలు తీసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి నాని ఏం సమాధానం చెబుతారు అంటూ జీవీఎల్ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పారు. “ఊఁ అంటావా.. నాని, ఉహూఁ అంటావా?” అంటూ ప్రశ్నించారు.

హిందూ వ్యతిరేక విధానాలు ఎండగడతాం.. కర్నూలు సభ ప్రధాన ఎజెండా ఇదే
కర్నూలులో తలపెట్టిన ప్రజా నిరనస సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక, ముస్లిం బుజ్జగింపు విధానాలను ఎండగట్టడమేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత నెలలో విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ తరహాలో కర్నూలు సభ విజయవంతం అవుతుందని ఆయనన్నారు. అక్రమంగా నిర్మిస్తున్న మసీదును అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు తమ పార్టీ నేతలు వెళ్తే, వారిపైనే దాడులు జరిగాయని, అయితే ఏపీ ప్రభుత్వం దాడి చేసినవారిపై కేసులు పెట్టకుండా, ఉల్టా బీజేపీ నేతలపైనే కేసులు పెట్టిందని ఆరోపించారు. ఈ దాడుల వెనుక పీఎఫ్ఐ వంటి రాడికల్ ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందని, అలాంటి విద్రోహ శక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండ కల్పిస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

మిర్చి రైతులను ఆదుకోరా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జీవీఎల్ ప్రశ్న
కొత్త రకం తామర తెగులు సోకి తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతుల గోడు పట్టదా అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం వాటాయే 40 శాతం ఉంటుందని తెలిపారు. కొత్త రకం తామర తెగులు కారణంగా ఏపీ, తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిన్నదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల హెక్టార్లకు పైగా మిర్చి పంట సాగవుతోందని, తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట సాగు జరిగిందని తెలిపారు. ఏపీలో 80 శాతం పంట కొత్త రకం తామర తెగులు (థ్రిప్స్ జాతి పురుగులు) కారణంగా దెబ్బతిన్నదని జీవీఎల్ అన్నారు.

ఈ క్రమంలో స్పైసెస్ బోర్డ్ తరఫున మిర్చి టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా తాను 25 మంది శాస్త్రవేత్తలు, పంట నిపుణులతో బుధవారం సమావేశం నిర్వహించానని, గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను కలిసి పరిస్థితిని వివరించానని అన్నారు. నష్ట నివారణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడానని తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రూ. 4 వేల కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లిందని అన్నారు. కొత్త రకం థ్రిప్స్ జాతి చీడపీడల నివారణ కోసం రైతులు ఎక్కువ మొత్తంలో పురుగు మందులు వినియోగించి, గతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయారని జీవీఎల్ వివరించారు. పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల పంటకు మేలు చేసే కీటకాలు సైతం నశించి మరో రకంగా నష్టం జరిగిందని తెలిపారు.

ఇంతగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు నష్టపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు అసలేమాత్రం పట్టించుకోవడం లేదని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పక్షపాతిగా చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్, మిర్చి రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయంతో పాటు పంటల సస్యరక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, అలాగే విపత్తు నిర్వహణ ప్రాథమిక బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదేనని గుర్తుచేశారు. తక్షణమే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement