Sunday, April 28, 2024

పావురాలతో రెస్.. పెద్ద ఎత్తున బెట్టింగ్.. తమిళనాడుకు చెందిన ఏడుగురు అరెస్ట్‌..

నాయుడుపేట (ప్రభన్యూస్‌): పావురాళ్లతో బెట్టింగ్‌ రేస్‌ నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన 7మందిని నాయుడుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు చూపెట్టి బెట్టింగ్‌ రేస్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు ఈ బెట్టింగ్‌ రేస్‌ను అడ్డుకుని నిర్వాహకులను అరెస్టు చేసి ఆ పావురాళ్లను నెల్లూరు వణ్యప్రాణి విభాగానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సీఐ సోమయ్య పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి చెందిన ఆయువీన్‌ ఫిలిప్స్‌ పావురాళ్లకు సంబంధించిన బెట్టింగ్‌ రేసును నిర్వహిస్తూ కొంతమంది అధిక లాభాలు గడిస్తున్నారన్నారు. ఈ క్రమంలో నకిలీ అనుమతి పత్రాలను ఉపయోగించి నాయుడుపేట పట్టణంలోని బిరదవాడ జంక్షన్‌ వద్ద సుమారు 521 పావురాళ్లను బెట్టింగ్‌ రేస్‌ నిర్వహిస్తుండగా సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకుని బెట్టింగ్‌ రేస్‌ నిర్వహిస్తున్న 7మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 521 పావురాళ్లతో పాటు మినీలారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.

చెన్నై మౌంట్‌కు చెందిన అయివిన్‌ ఫిలిప్స్‌, తిరుచ్చికి చెందిన పచ్చముత్తు వెంకటేషన్‌, రాజమోహన్‌లు నకిలీ అనుమతి పత్రాలతో ఆరోగ్య రాజన్‌, శ్రీనివాసన్‌ రమేష్‌, మణిమార్తాండ్‌, చంద్రబాబు బాలాజీలతో కలిసి మినిలారీలో సుమారు 521 పందెం పావురాళ్లను తీసుకుని నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ జాతీయ రహదారి సమీపంలో బెట్టింగ్‌ రేసులో భాగంగా పావురాళ్లను వదులుతున్నట్లు గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. వీరు పావురాళ్ల బెట్టింగ్‌ రేస్‌ ద్వారా రేసులలో ఉపయోగించే పావురాళ్లను ముందుగా ఎక్కడ వదిలినా మరలా తిరిగి వారి వద్దకే వచ్చే విధంగా ట్రైనింగ్‌ ఇవ్వడం జరుగుతుందని తర్వాత ఒక్కొక్కరికి సంబంధించిన పావురాళ్లకు ఒక్కో నంబర్‌ ఇచ్చి పావురాళ్ల కాళ్లకి ట్యాగ్‌లను కట్టి నెల్లూరు జిల్లా పరిధిలోని తడ, నాయుడుపేట, గూడూరు ప్రాంతాలలో బెట్టింగ్‌ రేసును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరి పావురాళ్లు ఈ రేసులో ముందుగా తిరుచ్చికి చేరుకుంటాయో వాటిని విజేతలుగా ప్రకటించి సదరు పావురాళ్ల యజమానికి నగదు బహుమతి అందిస్తుంటారు. ఈ బెట్టింగ్‌ రేసులను తిరుచ్చినందు ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేశారు.

ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన నాయుడుపేట మండల పరిధిలోని బిరదవాడ జాతీయ రహదారి జంక్షన్‌ వద్ద నకిలీ అనుమతి పత్రాలను ఉపయోగించి పావురాళ్లతో బె ట్టింగ్‌ రేసు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీరి వద్ద నుంచి 521 పావురాళ్లతో పాటు మినీలారీని స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. పట్టుబడిన పావురాళ్లను నెల్లూరు వణ్యప్రాణి విభాగం అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఎస్‌ఐ టీసి కృష్ణయ్య, బాలకృష్ణయ్యతో పాటు హెడ్‌కానిస్టేబుల్‌ రామ్మోహన్‌రాజు, కానిస్టేబుళ్లు పి బాలసుబ్రమణ్యంలను ఆయన అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement