Monday, April 29, 2024

Raa.. Kadiliraa – జగన్ వల్లే రాయలసీమకు జలగండం – చంద్ర‌బాబు

(ఆంధ్రప్రభ స్మార్ట్, పీలేరు ప్రతినిధి)- ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు, ప్రభుత్వమే మారింది.. నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు పెరిగాయి. నాడు లేని అప్పులు నేడు ఎందుకు పెరిగాయి. పేదవాడి బతుకు చితికిపోయింది. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. పప్పులు, చక్కెర, పెట్రోలు, డీజిలు ధరలు పెరిగిపోయాయి. బడ్జెట్ పెరిగింది. జీఎస్టీ ఆదాయం పెరిగింది. కానీ, ఈ వీర బాదుడేంటీ ? బాదుడే బాదుడు మనకు కావాలా ? అని టీడీపీ అధినేత చంద్రబాబు పీలేరులో ప్రజలను ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరులో శనివారం టీడీపీ ఏర్పాటు చేసిన ‘రా కదలిరా’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ దుర్మార్గుడి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదు.. సీమకు నీళ్లు ముఖ్యం, నేను రాయలసీమ బిడ్డను.. నాలో ప్రవహించేది రాయలసీమ రక్తం.. రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే టీడీపీ ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టిందని, సాగునీటి ప్రాజెక్టులకు ఈ జగన్ ఏం పొడిచాడు.. ఈ సైకో జగన్ ఒక్క పైసా ఖర్చు చేశాడా? అని ప్రశ్నించారు.

పీలేరుకు నీళ్లు వచ్చాయా ?
ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాలి. ఈ దుర్మార్గుడి పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు గండి పడితే 40మంది కొట్టుకు పోయారని చంద్రబాబు మండిపడ్డారు. 400 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులకు నష్టపరిహారం చెల్లించారా ? ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబానికి లక్ష రూపాయలు తామే అందించామని అన్నారు. ఈ సీఎం రూ.10లు ఇచ్చి రూ.100లు దోచుకోవటం జగనన్న పాలసీ అని, బటన్ నొక్కాను, బటన్ నొక్కాను అని చెబుతున్నాడని, బటన్ నొక్కి ఎంత దోచుకున్నావో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయి.. ఇక అబద్ధాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఏం చదువుకున్నాడో గానీ, అబద్ధాలు చెప్పటంలో పీహెచ్డీ చేశాడని ధ్వజమెత్తారు. నాడు నాణ్యమైన కరెంటును రూ.200లకే మేము ఇస్తే.. ఇప్పుడు కరెంటు బిల్లు రూ.1000 కి పెరిగిందని, కరెంటు కోతలు పెరిగాయన్నారు. కాయకష్టం చేసే కూలీలు సాయంత్రం ఓ పెగ్గు మందు తాగుతారని, నాడు రూ.60 ఉన్న క్వార్టర్ మందు ఇప్పుడు రూ.200కు పెరిగిందన్నారు.

జగనన్న జలగండం..
రాష్ట్రానికి జగనన్న జలగండం పట్టుకుందని చంద్రబాబు సెటైర్​ వేశారు. నదుల్లో ఇసుక ఉచితంగా ఇస్తే ఇప్పుడు ఇసుక బంగారమైపోయిందని, ఇసుక దొంగలు పెరిగిపోయారన్నారు. రాయలసీమ రతనాల సీమ కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల కష్టాలు తీరాలంటే టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement