Monday, April 29, 2024

పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిళ్లు.. ఏపీలో 600 కోట్ల ప‌న్నుల వ‌సూలు టార్గెట్‌!

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీలోని పంచాయతీ కార్యదర్శులపై ప‌న్నుల వ‌సూలు భారం ప‌డ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లు వసూలు చేయాల‌ని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. డిసెంబరులోగా ఈ ప‌న్నుల‌ను వసూలు చేయాలని కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లుల కోసం వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పన్నులపై పడటంతో పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చిన సమయంలో పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేయడం ఆనవాయితీ. డిసెంబరు 15న ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేస్తుంటారు. ఈసారి డిసెంబరు ఆఖరు నాటికే వసూలు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇంటి పన్నుల వసూలుపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి వారంవారం టార్గెట్లు- పెట్టి నివేదికలు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాస్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులపై పడుతున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరీ ఇంటి పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గ్రామాల్లో ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు, నాలుగు పంచాయతీలను పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీల్లో పారిశుధ్య చర్యలను వీరే చూడాలి. దీంతోపాటు- సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి కార్యక్రమాలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలి. ఈ బాధ్యతలతో పాటు- సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణ చేయాలి. పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులకు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పంచాయతీల్లో ఇంటి పన్నులను దాదాపు పూర్తిచేశామని, డిసెంబరు 15వ తేదీ నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతుండటంతో ఒత్తిడి పెరిగిపోతోందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులతో జరిగే జిల్లాస్థాయి సమావేశంలో తమ ఇబ్బందులను తెలియజేసేందుకు కార్యదర్శులు సిద్ధమవుతున్నారు. ఇటీ-వల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల రూపంలో రాష్ట్రంలోని 13000 పంచాయతీలకు రెండు విడతలుగా సుమారు రూ.900 కోట్లు- విడుదల చేసింది. గతంలో ఈ తరహా నిధులను ఏ ఖాతాకు మళ్లించారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. తాజాగా 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లులకు చెల్లిం చాలని ఆదేశాలు జారీచేశారు. వచ్చిన నిధులు విద్యుత్‌ బిల్లులకు మళ్లించడంతో నిధులు నిండుకున్నాయి. పారిశుధ్య పనులకూ నిధులు లేని పరిస్థితి.

- Advertisement -

రాష్ట్రంలో దాదాపు 13000 పంచాయతీలున్నాయి. వీటి నుంచి ఏటా సుమారు రూ.600 కోట్లకుపైగా ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. పాత బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన ఇంటి పన్నులను వసూలు చేయాలని ఇటీ-వల పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీ కార్యదర్శులతో యూట్యూబ్‌, జూమ్‌ యాప్‌ల ద్వారా కాన్ఫరెన్సులు పెట్టి వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారుల ఒత్తిడి భరించలేక పంచాయతీ కార్యదర్శులు, ఇంటి పన్నులు వసూలు చేసే సిబ్బంది ఇళ్లకు వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలా కడతామని, డిసెంబరు నుంచి ఫిబ్రవరి నెలలోపు కడతామని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు టార్గెట్లు- పెడుతుండటం, గ్రామస్థులు డబ్బు కట్టకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరీ రూ.10, రూ.20 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు- చెబుతున్నారు. పన్నులు వసూలు కాకున్నా, వసూలైనట్టుగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement