Friday, May 3, 2024

AP: 2024 ఎన్నికలకు సిద్ధం… 17,542 మంది సిబ్బంది అవసరం.. కలెక్టర్

శ్రీకాకుళం, నవంబర్ 3: జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి శుక్రవారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ అర్.రాధికతో కలసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 2357 పోలింగ్ స్టేషన్లను గుర్తించామని, సాయుధ భద్రత దళాలు మినహా 11,313 మంది పోలింగ్ ఆఫీసర్లతో కలిపి 17,542 మంది సిబ్బంది, పోలీసు వాహనాల మినహా 600 వరకూ వివిధ రకాల వాహనాలు అవసరమని గుర్తించామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది కోసం 9 శిక్షణా కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం 8 డిస్పాచ్ కేంద్రాలు, తిరిగి వాటిని స్వీకరించేందుకు 8 కేంద్రాలని, 16 స్ట్రాంగ్ రూమ్ లను, 17 కౌంటింగ్ సెంటర్లను ఇప్పటికే గుర్తించామని వివరించారు.

ఆయా కేంద్రాల వద్ద పోలీసు భద్రత కోసం 1300 మందిని సిబ్బంది నియమించనున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక పేర్కొన్నారు. మొబైల్ సిగ్నల్స్ లేని 13 (పాతపట్నం 12, పలాస 1) పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, రానున్న రెండు మూడు నెలల్లో అక్కడ కొత్తగా సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 15 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వివరించారు. వచ్చే డిసెంబర్ నెలాఖరుకు పోలింగ్ సిబ్బందికి శిక్షణలు పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ… 2019లో ఎన్నికల సందర్భంగా 672 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ రూ.53 లక్షలు విలువైన మద్యం సీజ్ చేసామని, 437 కిలోల గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేశామని వివరించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఇప్పటినుంచే పటిష్టమైన, కట్టుదిట్టమైన నిఘాను పెట్టనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, అదనపు ఎస్పీ తిప్పేస్వామి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement