Saturday, May 4, 2024

AP: 7న పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 3 (ప్రభన్యూస్) : ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి నందు డాక్టర్ వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్యంతో పనిచేసి, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో రెండు లక్షల 75 వేల మంది రైతులు రైతు భరోసా, ప్రధానమంత్రి కిషన్ యోజన లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. 7వ తేదీ ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్టు రాక, పుట్టపర్తి వై జంక్షన్, పోలీస్ పరేడ్ గ్రౌండ్, రహదారుల వెంట, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టు, ముఖ్యమంత్రి పర్యటన రాక, పోక, ప్రముఖులకు పాసులు మంజూరు చేయడం పుట్టపర్తి ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పటిష్టమైన భద్రతా చర్యలు ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాన్వాయ్ కి సంబంధించిన వివరాలు రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో చేపట్టాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాగునీరు సౌకర్యం, శానిటేషన్ సౌకర్యం చేపట్టాలని తెలిపారు. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరం అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. రేపటి రోజు మరలా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పుట్టపర్తి శివారు ప్రాంతంలోని వై.జంక్షన్ లో ఉన్న బహిరంగ సభ వేదిక (ప్రైవేట్ క్రికెట్ మైదానం) నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో, రవాణా, ఆర్టీసీ, డీఎస్ఓ, అన్ని సంక్షేమ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టి కార్యక్రమంలో విజయవంతం చేయుటకు కృషి చేయాలన్నారు. లబ్దిదారులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనే విధంగా ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతా యుతంగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement