Sunday, May 5, 2024

వేసవికి ముందే ఎక్కిళ్లు.. పట్టణాల్లో ట్యాంకర్ల చుట్టూ .. పల్లెల్లో వ్యవసాయ బోర్లు చుట్టూ..

ఒంగోలు, ప్రభన్యూస్‌ : పాతాళ గంగా రోజు రోజుకూ పడిపోతోంది. వేసవికి ముందే ఎండలు క్రమంగా పెరుగుతుండటంతో శరవేగంగా భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. ఫిబ్రవరి చివరివారంలోనే గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో క్రమంగా భూగర్భజల మట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. తాగునీటి సమస్యను తీర్చాలంటూ ఇటీవల గిద్దలూరు, పొదిలిలో మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారంటే నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్‌, మే నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పాలకుల అలక్ష్యం.. అవగాహన రాహిత్యానికి ప్రకృతి సహాయ నిరాకరణ తోడుకావడంతో జిల్లాలో ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు గుక్కెడు నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్వచ్ఛమైన నీరు దొరకక.. దాహం తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న కలుషిత నీటిని తాగి రోగాల పాలవుతున్నారు.

జిల్లాలోని 1,046 గ్రామ పంచాయతీల్లో 24,579 తాగునీటి బోర్డు ఉన్నాయి. అందులో 6,982 బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మొత్తం 2,138 అవాస ప్రాంతాలు ఉండగా..రక్షిత, మినీ రక్షిత మంచినీటి పథకాలు, పంపింగ్‌ పథకాలు జిల్లాలో 3,500 వరకు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 624 పథకాల నీటి వనరులు వట్టిపోయాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతోంది. గత వేసవి నుంచి నిరంతరంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా కోనసాగుతోంది. ప్రస్తుతం దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 88 గ్రామాల్లో రోజుకు 682 ట్రిప్పులు నీటి సరఫరా జరుగుతోంది. యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి వంటి ప్రాంతాల్లో ఏళ్ల తరబడి జలవనరులు లేకపోవడం, వర్షాధారం పైనే ఆధారపడుతుంటంతో ప్రతి ఏడాది పల్లెల్లో తాగునీటి క ష్టాలు రెట్టింపవుతోంది. అంతే కాదు నీటి వనరుల కొరత వలన పట్టణాల్లోనూ మూడు రోజులకొక సారి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గ్రామాల్లో తాగునీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. అవి అందరి దాహార్తిని తీర్చలేక పోతున్నాయి.

పట్టణాల్లో ప్రజలు నీటి కోసం వాటర్‌ ట్యాంకుల చుట్టూ గుమిగూడుతుండగా, పల్లెల్లో వ్యవసాయ బోర్ల పై ఆధారపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంటుంది. ఇళ్లల్లో నీటి వాడకాని వేసిన బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రోజు రోజుకూ నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. గంటల తరబడి మోటార్‌ వేసినా.. పదంటే పది బిందెల నీరు కూడా రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి నీటి సరఫరాకు కోట్ల రూపా య లు ఖర్చుచేస్తున్నా.. ప్రజలకు మాత్రం తాగునీటి కష్టాలు తప్పకపోవడానికి కారణం వర్షాభావానికి తోడు, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఏం చేయాలో తె లియని పరిస్థితి నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement