Thursday, May 2, 2024

Exclusive : తిరునగరిలో రగులుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల మంట 

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి నగరపాలక సంస్థ చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం మాటున రాజకీయ పరమైన మంట రగులుతోంది. ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణం గుండా నిర్మించ తలపెట్టిన మూడు రోడ్ల విస్తరణ ఈ వివాదానికి కేంద్ర బిందువవుతోంది. ఈ ప్రయత్నానికి సహజంగానే  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుండగా ఇతర ప్రధాన విపక్షాలు (గతంలో ఆ రోడ్ల నిర్మాణానికి జీఓ ఇచ్చిన ) ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సహా వ్యతిరేకిస్తున్నాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను నివారించడమే తమ లక్ష్యమని అధికారులు చెబుతుండగా యూనివర్సిటీ ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని, వందలాది చెట్లు నరికివేతతో పర్యావరణం దెబ్బతింటుందని, త్వరలో అలిపిరి వద్ద నిర్మించబోయే స్టార్ హోటల్ కు మేలు చేయడం కోసమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ అంశం పై నగరంలో అధికార,  ప్రతిపక్షాల నడుమ మాటల యుద్దాలు, నిరసనల సెగలు  ఊపందుకుంటున్నాయి. 

         

 4 లక్షల మందికి పైగా జనాభా, ప్రతిరోజూ సగటున లక్ష మందికి పైగా వచ్చే యాత్రీకులతో అలరారే తిరుపతి నగరంలో ట్రాఫిక్ పెద్ద సమస్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సమస్య పరిష్కారం కోసం తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  తిరుమల తిరుపతి దేవస్థానాలు (టి టి డి), స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో వివిధ దశల్లో నిర్మిస్తున్న శ్రీనివాస వారధి  తిరుమలకు వెళ్లే వాహనాలకు ఉపశమనం కానున్నది. ఇక ఏడాది క్రితం ఎన్నికైన తిరుపతి నగరపాలక సంస్థ పాలకమండలి అంతర్గత రోడ్ల విస్తరణ పనులతో పాటు నగరానికి వచ్చే ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ కొత్తగా 17 రోడ్ల  నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. తిరుపతి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన ఈ రోడ్ల నిర్మాణం వెనుక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుమారుడైన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవ ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. ఈ క్రమంలో ఇప్పటివరకు నిర్మించిన రెండుమూడు రోడ్లు కొత్తగా నిర్మించే మాస్టర్ ప్లాన్ రోడ్లు నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించగలవని విశ్వాసాన్ని నగర వాసుల్లో కలిగిస్తున్నాయి. 

- Advertisement -

 2017 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకుంఠమాల మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో కొన్ని కూడా ఇందులో ఉండడం గమనార్హం. ఈ నేపధ్యంలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా తిరుపతి – చంద్రగిరి రహదారి నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణం గుండా అలిపిరిని కలిపే విధంగా మూడు రోడ్లను విస్తరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. నగరపాలక సంస్థ కృషి ఫలితంగా అటు ఆ స్థలాల అసలు యజమాని అయినా టి టి డి కానీ, లీజు కలిగి ఉన్న ఎస్వీ యూనివర్శిటీ అధికార వర్గం కానీ ఆ పనులకు అడ్డు చెప్పలేదు. మరోవైపు ప్రతిపాదించిన ఆ మూడు రోడ్లలో రెండు ప్రధాన రోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం 2019 మార్చి నెలలో జీఓ (నెం 112) కూడా జారీ చేసి ఉండడం విశేషం. ఆ రెండు రోడ్లతో పాటు మరో రోడ్డును కలిపి 60, 80, 100 అడుగుల రోడ్లుగా విస్తరించి అలిపిరి – చెర్లోపల్లి బై పాస్ రోడ్డుతో కలపడానికి తిరుపతి నగర పాలక సంస్థ సన్నాహాలు మొదలు పెట్టింది.

ఇందుకు యూనివర్సిటీ అధికార వర్గం, అధ్యాపక, బోధనేతర సిబ్బంది సంఘాలు కూడా మద్దతు ఇవ్వడంతో పనులు మొదలయ్యాయి. ఈ దశలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో యూనివర్సిటీ ప్రాంగణంలో రహదారులు నిర్మించడం వల్ల యూనివర్సిటీలోని ప్రశాంతతకు భంగం కలుగుతుందని, విస్తరణ పేరుతో తొలగించే వందలాది చెట్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న అంశాలు ఉన్నాయి. అంతేకాక ఇటీవలే సీఎం జగన్ వర్చువల్ గా శంకుస్థాపన చేయగా, చెర్లోపల్లి – అలిపిరి రహదారిపై నిర్మించ నున్న ఒక స్టార్ హోటల్ కోసమే ఈ రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ వాదనలకు మద్దతుగా ఆ మూడు రోడ్ల నిర్మాణాలను ఆపాలని డిమాండ్ తో ఆయా పక్షాల నాయకులు ఎస్వీ యూనివర్సిటీ, నగరపాలక సంస్థ అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. మీడియా సమావేశాల ద్వారా రోడ్లను ఆపాలని డిమాండ్ చేశారు. పలు రకాల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వీరికి మద్దతుగా కొన్ని విద్యార్ధి సంఘాలు కూడా ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నాలు కూడా చేశాయి.

వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి కొంచం ముందుకు వెళ్లి ఆ మూడు రోడ్ల నిర్మాణాన్ని  న్యాయస్థానం ద్వారా అడ్డుకుంటామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆ మూడు రోడ్ల నిర్మాణం కేవలం తిరుపతి – చంద్రగిరి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికేనని, పైగా అక్కడ ఇప్పటికే ఉన్న రోడ్లనే వెడల్పు చేయడం, కొంతమేరకు పొడిగించడం మాత్రమే చేస్తున్నామని, దీనివల్ల నగరానికి పడమటి వైపు నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల రద్దీ ప్రభావం నగరంపై తగ్గుతుందని అటు నగర పాలక సంస్థ అధికారులు, పాలకమండలి సభ్యులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణలు ఇస్తున్నారు. ఇందులో రెండు రోడ్లు నిర్మాణ విస్తరణలకు గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ నాయకుల  వాదనలకు మద్దతుగా తమ నిరసనల ద్వారా తిరుపతి నగర అభివృద్ధిని రాజకీయ పరమైన కారణాలతో అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించే నాయకుల దిష్టి బొమ్మలతో శవయాత్ర చేసి తగులబెట్టి నీరసన తెలిపారు. ప్రతిపక్షాలలో ఎస్వీ యూనివర్సిటీ గుండా చేపట్టే విస్తరణ పనులను సమర్ధించించి సీపీఎం నాయకుడు కందారపు మురళి  శవయాత్ర వంటి ప్రదర్శనలను నిరసించారు. మొత్తం మీద  ప్రస్తుతం ఎస్వీ యూ ప్రాంగణం గుండా నిర్మించ తలపెట్టిన మూడు మాస్టర్ ప్లాన్ రోడ్ల అనుకూల, ప్రతికూల నినాదాలతో, మాటల యుద్దాలతో, నిరసన ధ్వనులతో  తిరుపతి నగరం ప్రతిధ్వనిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement