Saturday, May 4, 2024

AP: డిఎస్సీ నోటిఫికేష‌న్ ….నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిష‌న్ ..

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవలే డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణకు అనుమతి కోరారు పిటిషన్ తరపు న్యాయవాది.

ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. బీఈడీ అభ్యర్థులను అనుమతించడంతో 10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

- Advertisement -

దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్‌సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు.. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపించారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం అత్యవసర విచారణ సోమవారం చేపడతామని వెల్ల‌డించింది.

కాగా, మొత్తం 6100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. అందులో.. 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. 2,280 ఎస్‌జీటీ పోస్టులు.. 1,264 టీజీటీ పోస్టులు.. 215 పీజీటీ పోస్టులు.. 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి. 2018 సిలబస్‌ ప్రకారమే ఈ డీఎస్సీ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా.. రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండగా.. మార్చి 5వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక, మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ 2024 పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల కానుంది.. ఏప్రిల్‌ 1వ తేదీన కీ పై అభ్యంతరాల స్వీకరించి.. ఏప్రిల్‌ 2వ తేదీన ఫైనల్‌ కీ విడుదల చేస్తారు. ఇక, ఏప్రిల్‌ 7వ తేదీన తుది ఫలితాలు ప్రకటించే విధంగా ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement