Sunday, May 5, 2024

బాబు, జగన్ పాలన చూసిన జనం విసిగిపోయారు.. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో గిడుగు రుద్రరాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పాలనే మేలని భావిస్తున్నారని ఏపీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ఢిల్లీ చేరుకున్న ఆయన, సోమవారం ఏఐసీసీలో పలువురు జాతీయపార్టీ నేతలను కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు అప్పగించిన పదవిని పదవిలా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషిచేస్తానని, ఒక కార్యకర్తలా శ్రమిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అధిష్టానం సలహాలు, సూచనలు తీసుకుంటానని అన్నారు. రాష్ట్రం మీదుగా సాగిన ‘భారత్ జోడో’ యాత్రకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందని, ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పార్టీ పోటీ చేస్తుందని, అంశాలవారీగా కలిసివచ్చేవారిని కలుపుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వివరించారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ కోసం ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ సీనియర్ న్యాయవాది శేషగిరి రావుతో పాటు మరికొందరు న్యాయవాదులు గిడుగు రుద్రరాజును అభినందిస్తూ సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement