Sunday, April 28, 2024

Pawan Kalyan – చేబ్రోలులో జనసేనానికి డూప్లెక్స్ ఇల్లు రెడీ

రూపాయి అద్దెతో ఇచ్చిన యజమాని ఓదూరి నాగేశ్వరరావు
పార్టీ కార్యకలాపాలు.. పవన్ వసతికి అనుకూలం

(ఆంధ్రప్రభ , పిఠాపురం) ఇక్కడే ఇల్లు తీసుకుంటా. ఇక్కడే ఉంటా. అందరికీ అందుబాటులో ఉంటా, అని పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీని జనసేనాని పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ఇక పిఠాపురం వాసి కాబోతున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించగా.. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఎంపిక చేశారు.

ఈ ఇంటిలో శుక్రవారం గృహప్రవేశం కూడా జరిపారు.. ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల పార్కింగ్‌కు, మొదటి ఫ్లోర్‌లో ఆఫీసు నిర్వహణకు, రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్సు తరహాలో నిర్మించారు. పవన్‌కు అనువుగా ఉంటుందని భావించిన పార్టీ నేతలు దీనిని ఎంపిక చేశారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్‌ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

తనకు అద్దె వద్దని, కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్‌ పిఠాపురం రానుండటంతో అప్పటికే ఈ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement